
పెండింగ్ కేసులు తగ్గించాలి
మార్కాపురం: పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో గురువారం జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను నియంత్రించాలని, రికవరీల్లో వేగం పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శాంత్రి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎవ్వరీని ఉపేక్షించవద్దన్నారు. టెక్నాలజీని ఉపయోగించి కేసులను త్వరగా ఛేదించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్తుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జీషీటుకు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై రివ్యూ నిర్వహించారు. స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, శారీరక నేరాలు, ప్రాపర్టీ నేరాలు, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమీక్షించి పలు సూచనలు చేశారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతి పోలీసు అధికారి విలేజీ విజిట్ చేయాలన్నారు. తరుచూ నేరాలకు పాల్పడే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు సందర్శించి ఉపాధ్యాయులతో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. రాత్రిళ్లు గస్తీళ్లు పెంచి దొంగతనాలు, దోపిడీలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకోసం ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. గుట్కా, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. శక్తి కాల్స్‌పై వెంటనే స్పందించాలన్నారు. కొమరోలు మండలం పురుషోత్తమపల్లి గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ ముత్యాల రామిరెడ్డి, పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన బద్దల రత్నారెడ్డి, అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న డ్రోన్ కెమెరాలను ఎస్పీకి అందచేశారు. ఈ కెమెరాలను కొమరోలు, పీసీపల్లి పోలీసుస్టేషన్లకు ఎస్పీ అందజేశారు.
ఐజీ వీడియో సమీక్ష..
మార్కాపురంలో జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ ఐజీ బాలరాజు జూం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరాలను ఛేదించేందుకు టెక్నాలజీని ఉపయోగించే విధానాలపై సూచనలు చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకొని జిల్లా మంచి పురోగతిని సాధించిందని అభినందించారు. కార్యక్రమంలో అడ్మిన్, అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, డీఎస్పీలు నాగరాజు, శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, సాయి ఈశ్వర యశ్వంత్, రమణ కుమార్, ఎస్‌బి సీఐ రాఘవేంద్ర, డీసీఆర్‌బీ సీఐ దేవప్రభాకర్, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, మార్కాపురం సీఐ పి.సుబ్బారావు, పామూరు సీఐ భీమానాయక్, జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
నేరాల కట్టడి, నిందితుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ దామోదర్

పెండింగ్ కేసులు తగ్గించాలి