
వల్లెపు వంశీ (ఫైల్)
చీమకుర్తి: చీమకుర్తి రామ్‌నగర్‌కు చెందిన వల్లెపు వంశీ (9) అదృశ్యమైనట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామిరెడ్డి వెల్లడించారు. గత నెల 29వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో వినాయకుడి విగ్రహం నిమజ్జన ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చీమకుర్తిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వంశీ 5వ తరగతి చదువుతున్నాడని, ఆచూకీ తెలిసిన వారు చీమకుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య
పొన్నలూరు: భార్యపై అనుమానంతో ఇంట్లో ఉరి వేసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడాడు. ఈ సంఘటన స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొన్నలూరులోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దార్ల సురేష్ (41)కు నాగమణితో 16 ఏళ్ల కిత్రం వివాహమైంది. సురేష్ బేల్దారి, పెయింటింగ్ పనులు చేస్తుండగా, భార్య నాగమణి కూలి పనులకు వెళ్తుంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, నాగమణి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త సురేష్ తరచూ గొడవ పడేవాడు. ఆమెను పుట్టింటికి పంపించడంతో ఇరు కుటుంబాల పెద్దలు సర్దిచెప్పి మళ్లీ కలిపారు. ఆదివారం కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఆమె ముందే ఉరివేసుకోవడానికి సురేష్ ప్రయత్నించాడు. పిల్లలు ఇంటి పక్కవారిని పిలవడంతో వాళ్లు వచ్చి సర్దిచెప్పి వెళ్లిపోయారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నాగమణి, పిల్లలు బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న సురేష్.. చొక్కాతో ఇనుప రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై రాజారావు వెళ్లి పరిశీలించారు. సురేష్ ఆత్మహత్యకు నాగమణి వివాహేతర సంబంధమే కారణమని బంధువులు వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు
టంగుటూరు: గుర్తు తెలియని కారు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని తూర్పునాయుడుపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. టంగుటూరు గ్రామానికి చెందిన బొడ్డు సుధాకర్, వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై ఒంగోలు వెళ్తుండగా తూర్పునాయుడుపాలెం వద్ద గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. సుధాకర్ తీవ్రగాయాలై శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వెంకటేశ్వర్లుకు ఎడమ కాలు విరిగింది. క్షతగాత్రులను జాతీయ రహదారి అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు.

సురేష్ (ఫైల్)