
డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్న నెల్లూరు జోన్ ఈడీ షేక్ ఆదం సాహెబ్
● నెల్లూరు జోన్ ఈడీ షేక్ ఆదం సాహెబ్
ఒంగోలు: ఆర్టీసీ ప్రథమ నినాదం ప్రయాణికుల భద్రత అని, ప్రమాద రహితంగా బస్సులు నడపడం ఆర్టీసీ డ్రైవర్ల ప్రథమ కర్తవ్యమని నెల్లూరు జోన్ ఈడీ షేక్ ఆదం సాహెబ్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ ఒంగోలు డిపో ట్రైనింగ్ కాలేజీలో రోడ్డు భద్రత, ఇంధన పొదుపు అనే అంశంపై ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా బస్సులు నడిపేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. రద్దీ ప్రదేశాల్లో బస్సులు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అంతే కాకుండా ఇంధన పొదుపు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్టీసీలో ప్రతి డిపో రోజుకు వేలలీటర్ల డీజిల్ వినియోగిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రతి డ్రైవర్ రోజుకు ఒక చుక్క మిగిల్చినా ఆర్టీసీకి ఏడాదిలో అత్యంత అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. ప్రభుత్వం ప్రయాణికులకు అత్యంత ఉత్తమ సేవలు అందించాలనే తపనతో ఉందని, ఆ లక్ష్యం దిశగా ప్రతి డ్రైవర్ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎం బి.సుధాకర్, నెల్లూరు డీసీఎంఈ శ్రీనివాసరెడ్డి, వివిధ డిపోల నుంచి మేనేజర్లు, అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులు అక్టోబర్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.