
ఒంగోలులోని దేవుడుచెరువులో పూసల అలంకరణలో మట్టి గణపతి
యర్రగొండపాలెం: మండలంలోని అమానిగుడిపాడు గ్రామానికి చెందిన విద్యార్థి జమ్మి సుబ్బారావు (24) యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో గుండెపోటుతో మృతిచెందాడు. ఎమ్మెస్సీ పూర్తిచేసిన సుబ్బారావు యూకేలోని కార్డిఫ్‌లో ఎమ్మెస్ చేసేందుకు ఈ నెల 7వ తేదీ అమానిగుడిపాడు నుంచి బయలుదేరి చైన్నె వెళ్లాడు. 8వ తేదీ చైన్నెలో లండన్ ఫ్‌లైట్ ఎక్కి కార్డిఫ్ చేరుకున్నాడు. 16వ తేదీ కళాశాలలో చేరేందుకు అక్కడ పరిచయమైన స్నేహితులతో కలిసి మెట్రోపాలిటిన్ యూనివర్శిటీకి బస్సులో బయలుదేరాడు. కార్డిఫ్ యూనివర్శిటీ చేరేందుకు రెండు బస్సులు మారాల్సి ఉండగా, సుబ్బారావు రెండో బస్సు ఎక్కడానికి సిద్ధమవుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. సమీపంలోని షాపులో షోడా తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడి పోలీసులు అమానిగుడిపాడులోని సుబ్బారావు ఇంటికి ఫోన్‌చేసి సమాచారం అందించేందుకు ప్రయత్నించారు. అయితే, వాళ్లు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటంతో సుబ్బారావు తల్లిదండ్రులు జమ్మి లక్ష్మయ్య, కోటమ్మలు ఏవో కంపెనీకాల్స్ అనుకుని పట్టించుకోలేదు. బుధవారం కన్సల్టెన్సీ నుంచి సమాచారం అందుకుని కుప్పకూలిపోయారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఆ కుటుంబం ఒక్కగానొక్క కుమారుడైన సుబ్బారావును ఉన్నత చదువులు చదివించేందుకు యూకే పంపారు. సుబ్బారావుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు.. ఇక తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి గుండెలవిసేలా విలపిస్తున్నారు. సుబ్బారావు మృతి అమానిగుడిపాడు గ్రామంలో తీవ్రవిషాదాన్ని నింపింది. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
చల్లగ చూడయ్యా.. గణపయ్యా
– చిత్రమాలిక 8లో

జమ్మి సుబ్బారావు