
వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త కుట్రలకు తెరలేపుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఎన్నికకు ఈసీ విడుదల చేసిన పోలింగ్ బూత్ లిస్ట్ చూస్తే దారుణంగా ఉందన్నారు. ‘ ఈ ప్రభుత్వం మరొక భారీ కుట్రకు తెరతీసింది. నల్లపురెడ్డిపల్లె వారు ఎర్రబెల్లి వెళ్ళి ఓటేయాలి అంటున్నారు. గతంలో ఏ గ్రామంలో ఉండే బూత్ లో వాళ్ళు ఓటేసుకున్నారు. ఇప్పుడు మార్చిన తీరు ప్రకారం 4 కిలో మీటర్ల దూరం వెళ్ళి ఓటు వేయాల్సి వస్తోంది.
దీనివల్ల పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది. మొన్న నల్లగొండపల్లిలో ఎంత దాడికి దిగారో మీకు తెలుసు. మరి ఈ ఓటర్లు వేరే ఊరికి వెళ్లి ధైర్యంగా ఎలా ఓట్లు వేయగలరు. ఇది అర్థరహితం. కేవలం పోలింగ్ శాతం తగ్గించాలి అనే టీడీపీ ఈ ప్రయత్నం చేస్తోందా..?, ఎన్నికల కమిషన్ అందరూ ఓటేసేలా చూడాల్సిన బాధ్యత ఉంది. 6 పోలింగ్ బూత్ లపై ఈ ప్రభావం ఉంది. 3,900 ఓట్లు 36 శాతం మందికి ఈ సమస్య తలెత్తింది. ఎప్పుడైతే బూత్ ల లిస్టు విడుదలైందో అప్పుడు టీడీపీ కుట్ర బయటపడుతుంది.
ఇప్పటికే దాడులు, బైండోవర్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజు మరో ఘనకార్యం చేసారు...బూత్ లు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేసారు. ఎట్టిపరిస్థితుల్లో ఏ ఊర్లో వాటిని అదే ఊర్లో ఓటేసి అవకాశం కల్పించాలి. ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలి. తప్పనిసరిగా పోలింగ్ బూత్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 2021లో ఏవిధంగా అయితే బూత్ లు ఉన్నాయో అలానే ఉంచాలని వినతి’ అని ఎంపీ అవినాష్ స్పష్టం చేశారు.