‘నలుగురిని చంపిన చరిత్ర అచ్చెన్నాయుడిది’

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: సర్పంచ్‌లుగా నామినేషన్లు వేయటానికి వెళ్లిన నలుగురిని చంపిన చరిత్ర అచ్చెన్నాయుడిదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నన్ను చంపుతానని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జంటుగా నన్ను అరెస్టు చేయమని చంద్రబాబు, అచ్చెన్నాయుడు గోల చేస్తున్నారు. ఆ వెంకటరావు అనే వ్యక్తి ని నేను ఇంతవరకు చూడలేదు. అతను టీడీపీ సీనియర్ కార్యకర్త. అచ్చెన్నాయుడు.. ఓటమి తప్పదని ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నారని’’ దువ్వాడ దుయ్యబట్టారు.
చదవండి: ఈసారి ఆ 23 సీట్లు కూడా రావు: ఎమ్మెల్సీ పోతుల సునీత
‘‘నన్ను చంపమని అచ్చెన్నాయుడు ఈ వెంకటరావుతో ఒప్పందం కుదుర్చున్నాడు. ఈ విషయం బయట పడటంతో అచ్చెన్నాయుడే అతన్ని చంపించాడు. అసలు విషయం బయటకు రాకముందే నన్ను అరెస్టు చేయమని డిమాండ్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటి?. ఈ కేసులో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్‌లను అరెస్టు చేసి విచారణ జరపాలి. నామీద ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్నారు. కానీ మేము పట్టించుకోలేదు. టీడీపీ పని అయిపోయింది. మళ్ళీ సీఎం జగనే కావాలని జనం కోరుకుంటున్నారని’’ దువ్వాడ అన్నారు.
‘‘ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వారి కార్యకర్తల్లో ఉత్సాహం కోసం అలా చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు మళ్ళీ వైఎస్ జగనే కావాలనుకుంటున్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎంత హడావుడి చేసినా జనం విశ్వసించే పరిస్థితి లేదని’’ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు.