
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి సీఎం చంద్రబాబు ఎంత భయపడిపోతున్నారో ప్రస్తుతం ఓ చిన్న ఎన్నిక కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తేనే అర్ధమవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చిన్న ఎన్నికకు జగన్ అంటే సీఎం చంద్రబాబు ఎంత భయపడుతున్నారో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. టీడీపీ నేతల దాడిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు.
మా నేతలపై దాడి చేసినా ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలేదు. తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించటం లేదు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం. దాడులకు గురైన వారిపైనే రిటర్న్ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గం. పులివెందుల జెడ్పీటీసీ సెగ్మెంట్ లో గెలిచి ఆధిపత్య రాజకీయాలు చూపించాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికలు జరుగుతుంది వైఎస్సార్‌సీపీకి కూటమికి మాత్రమే కాదు. వైసీపీకి పోలీసులకు.. వైసీపీకి ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది..
సీఎం స్థాయిలో కూర్చున్న వ్యక్తి జెడ్పీటీసీ ఎన్నికను పర్యవేక్షించటం చంద్రబాబు హయంలోనే మొదలైంది..డీజీపీ కార్యాలయానికి వెళ్తే పోలీసులను పెట్టి ఆపిస్తున్నారు. డీజీపీ రాష్ట్రానికా.. టీడీపీ కా?, ప్రజా ప్రతినిధులు వస్తే ఔట్ వార్డులో ఇచ్చి వెళ్ళమంటారా?, ఎస్సీ నేతలమని మాపై డీజీపీ వివక్ష చూపిస్తున్నారు. కనీసం ఒక్క అధికారి కూడా రాలేదు. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్ళినా.. డీజీపీ కార్యాలయానికి వెళ్ళినా ఇదే తంతు జరుగుతుంది. చంద్రబాబు దృష్టిలో పడాలని అధికారులు పోటీలు పడుతున్నారు. మార్చిన పోలింగ్ కేంద్రాలు యధాస్థానంలో ఉంచాలి. మేము ఓడిపోతామనే భయంతో మాట్లాడటం లేదు.ఎన్నికల సంఘానికి ఇది శల్య పరీక్ష అని గుర్తుంచుకోవాలి. మా నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి. హైకోర్టు ఆదేశాలు పాటించాలి’ అని సూచించారు.