ఇది చేతకాని ప్రభుత్వం: వైఎస్‌ షర్మిల

YS Sharmila Will rescue all oustees under Dindi Project - Sakshi

నిర్వాసితులకు తగిన పరిహారం 

ఇవ్వకుంటే ఆమరణదీక్ష చేస్తా: షర్మిల 

సీఎం కేసీఆర్‌ ఉద్యోగం తీసేస్తేనే ప్రజలకు న్యాయం 

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర 

నాంపల్లి: సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించకుంటే ఆమరణదీక్ష చేస్తానని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రం నుంచి వట్టిపల్లి, దామెరభీమనపల్లి, భీమనపల్లి కొత్తకాలనీ, కమ్మగూడెం, నాంపల్లి మండలం దామెర క్రాస్‌రోడ్డు వరకు సాగింది. మర్రిగూడలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు పాలన చేతకాదని విమర్శించారు.

డిండి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల పక్షాన పోరాడుతామని తెలిపారు. కిష్టరాయిన్‌పల్లి, చర్లగూడెం ప్రాజెక్ట్‌ నిర్వాసితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు. ప్రాజెక్టులకు భూములిస్తే, నిర్వాసితుల కు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ బాధితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బకాసురుని వలే మేస్తున్నారని, ఉద్యోగాల పేరిట కాలయాపన చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారని షర్మిల విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం, అధికారులకు సమస్యలు చెబితే తీరవని, కేసీఆర్‌ ఉద్యోగం తీసేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకోవాలంటే రాజన్నరాజ్యం తప్పకుండా రావాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి హయాంలో 46 లక్షలు పేదలకు ఇళ్లు కట్టించారని ఆమె గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పిట్టా రాంరెడ్డి, సురేశ్‌రెడ్డి, సత్యవతి, భాస్కర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, సిరాజ్, నవీన్, కళ్యాణ్, భాస్కర్, వనమాల ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top