
కోదాడ నియోజకవర్గంలోని రత్నవరంలో మాట్లాడుతున్న షర్మిల
కోదాడ: రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి ప్రభుత్వ అసమర్థతే కారణమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి, నడిగూడెం మండలాల్లో పర్యటించారు. నడి గూడెం మండలం రత్నవరంలో ఆమె మాట్లాడారు.
యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం వెల్లదీశాయని, దీంతో అన్నదాతలను మిల్లర్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర ఇవ్వకుండా, కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా కేవలం భూస్వాములకు లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బతికున్న రైతులను ఆదుకోమంటే చనిపోయిన తర్వాత రైతుబీమా ఇస్తామని చెప్పడం ఏంటని షర్మిల ప్రశ్నించారు.