యూపీలో బీజేపీ సామాజిక వ్యూహం  | Yogi Meets PM Modi Amid Friction Ahead Of Election | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీ సామాజిక వ్యూహం 

Jun 14 2021 9:16 AM | Updated on Jun 14 2021 10:01 AM

Yogi Meets PM Modi Amid Friction Ahead Of Election - Sakshi

న్యూఢిల్లీ: ప్రాంతీయంగా, సామాజికంగా బలంగా ఉన్న చిన్న పార్టీలను, ఇతర పార్టీల్లో ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా బలంగా ఉన్న నాయకులను కలుపుకుని ఎన్నికల్లో గెలవడాన్ని బీజేపీ చాన్నాళ్లుగా ఒక వ్యూహంగా కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యూహాన్నే 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయవంతంగా ఉపయోగించింది. వచ్చేఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ దిశగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బీజేపీ అగ్రనేత,  హోంమంత్రి అమిత్‌ షాతో ఇతర సీనియర్‌ నాయకులు అప్నాదళ్‌ (ఎస్‌), నిషాద పార్టీ నాయకులతో సంప్రదింపులు ప్రారంభించారు. 

ఈ రెండు పార్టీలు బీజేపీకి మిత్రపక్షాలే అయినా, ప్రభుత్వంలసరైన ప్రాతినిధ్యం లభించలేదన్న అసంతృప్తితో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ కీలక నేత జితిన్‌ ప్రసాదను ఇప్పటికే పారీ్టలో చేర్చుకున్నారు. రాష్ట్రంలో ప్రభావశీల బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన జితిన్‌ ప్రసాదను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అసంతృప్తితో ఉన్న కొన్ని బ్రాహ్మణ వర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. 

అమిత్‌ షాతో భేటీపై ఇప్పటివరకైతే అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌ నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు. అణగారిన వర్గమైన ‘నిషాద్‌’లకు రాష్ట్ర ప్రభుత్వంలో తగిన భాగస్వామ్యం కల్పిపంచడమే తమ ఏకైక డిమాండ్‌ అని నిషాద్‌ పార్టీ నేత సంజయ్‌ నిషాద్‌  స్పష్టం చేశారు. వెనుకబడినవర్గాలుగా పరిగణిస్తున్న కేవట్‌ వర్గీయులకు షెడ్యూల్డ్‌ కులాలకు అందించే ప్రయోజనాలను కల్పించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. సంజయ్‌ నిషాద్‌ కుమారుడు ప్రవీణ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున  ఆదిత్యనాథ్‌ ప్రాబల్యం అధికంగా ఉన్న గోరఖ్‌పూర్‌ నుంచి గెలుపొందడం బీజేపీని షాక్‌కు గురిచేసింది. దాంతో, 2019 ఎన్నికల్లో వారిని అనుకూలంగా మార్చుకుంది. అప్నాదళ్‌కు చెందిన, కుర్మి సామాజిక వర్గానికి చెందిన అనుప్రియ పటేల్‌ మోదీ తొలి ప్రభుత్వం లో మంత్రిగా ఉన్నారు. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్‌  కాంగ్రెస్‌తో పొత్తుకు విఫలయత్నం చేసినందువల్లనే ఆమెకు రెండోసారి మంత్రి పదవి లభించలేదని వార్తలు వచ్చాయి. మాజీ మిత్రపక్షం సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీని కూడా మళ్లీకలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఆ వార్తలను ఆ పార్టీ నేత ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ తోసిపుచ్చారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని, చిన్న పార్టీలతో పొత్తుకు వ్యతిరేకం కాదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ పలు చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాల నేతల కు దగ్గరయ్యే ప్రయత్నాలను ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా ప్రారంభించారు. కరోనా కట్టడిలో విఫలమయ్యారని, కరోనా తీవ్రతను అడ్డుకోలేకపోయారని సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. దీనిపై కొందరు నేతలు అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. దీనిపై నష్ట నివారణ చర్యలను కూడా అగ్ర నాయకత్వం చేపట్టింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఈ దిశగా అమిత్‌ షా మిత్రపక్షాలతో చర్చలు కూడా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement