Huzurabad Bypoll: కోడికూర ఉండాల్సిందే..!

Wine And Meat Full Demand in Huzurabad Bypoll - Sakshi

పక్క నియోజకవర్గాల నుంచి హుజూరాబాద్‌కు నాయకులు

మాంసం, మందు, వ్యాక్సిన్‌కు ఫుల్‌ గిరాకీ

ఉపఎన్నిక ప్రచారంలో ఇవే కీలకం

హోటళ్లు, ట్రావెల్స్, వైన్స్‌షాపులు బిజీ

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఏమో కానీ.. టౌన్‌లో మాంసం, మందుకు ఒక్కసారిగా ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పుడు ఏ నలుగురు కలిసినా అక్కడ వినిపించే మాటలు ఇవే. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఉప ఎన్నికలో రెండో ఘట్టమైన ప్రచారం పర్వం మొదలైంది. పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందుకోసం పక్క నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను హుజూరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో పాల్గొన్న వారికి మర్యాదలు కూడా బాగానే చేస్తున్నారు.

హోటళ్లు కిటకిట..!
కీలకమైన ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు ఇక్కడ కొన్ని వార్డులు, కాలనీలు అప్పగించారు. వారి ఆతిథ్యం మొదలుకుని ప్రచారంలో తాగునీరు, వాహనానికి అయ్యే పెట్రోలు దాకా అన్నీ పార్టీల నాయకులే చూసుకుంటున్నారు. ఇక పగలంతా ప్రచారం చేసి ఏ రాత్రికో వీరు తమకు కేటాయించిన గదుల్లోకి చేరుతున్నా రు. అక్కడ అసలైన మర్యాదలు మొదలవుతున్నా యి. దాదాపు రెండు నెలలుగా ఇక్కడ ప్రముఖ హోటళ్లు, లాడ్జి గదులన్నీ హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టాయి. కరోనా దెబ్బకు అన్ని పట్టణాల్లో టు లెట్‌ బోర్డులు దర్శనమిస్తుంటే.. బయటి నుంచి వచ్చిన వారితో హుజూరాబాద్‌లోని అద్దె ఇళ్లు, హోటళ్లు కిటకిటలాడిపోతున్నాయి.

కోడికూర ఉండాల్సిందే..!
హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ మద్యం, మాంసం విక్రయాలు పెరిగాయి. సాధారణంగా హుజూరాబాద్‌ పట్టణంలో రోజుకు 6 క్వింటాళ్ల చికెన్‌ను వ్యాపారులు విక్రయించేవారు. కానీ.. షెడ్యూలు ప్రకటించాక చికెన్‌కు డిమాండ్‌ అమాంతం పెరిగింది. ప్రతీరోజూ కార్యకర్తలకు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం మెనూలో చికెన్‌ కూర తప్పనిసరి. దీంతో చికెన్‌ డిమాండ్‌ ఇప్పుడు రోజుకు 10 క్వింటాళ్లకు చేరిందని వ్యాపారులు వెల్లడించారు. ప్రస్తుతం కిలో రూ.240 పలుకుతోంది. ఈ లెక్కన క్వింటాలుకు రూ.24,000, పది క్వింటాళ్లకు రూ.2,40,000 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. స్థానికంగా బిర్యానీ, కోడికూరలకు ప్రసిద్ధి చెందిన హోటళ్లు, రెస్టారెంట్లలోనూ చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది.

వ్యాక్సిన్‌ కోసం పరుగులు..
కేంద్ర ఎన్నికల సంఘం రెండో డోస్‌ తప్పనిసరి చేయడంతో కార్యకర్తల్లో చాలామంది టీకా కోసం పరుగులు తీస్తున్నారు. ప్రచారం చేసేవాళ్లు కూడా రెండు డోసులు వేసుకోవాలి. దీంతో పెద్ద నాయకుల సాయం తీసుకుని మరీ టీకా తీసుకుంటు న్నారు. ప్రచార పర్వం ఆసాంతం కీలకంగా వ్యవహరించే కొందరు నాయకులు, అనుచరులకు వెంటనే రెండో డోసులను బడా నాయకులు దగ్గరుండి వేయిస్తున్నారు. డోసుకు డోసుకు మధ్య తక్కువ వ్యవధి ఉంటుందని అంతా కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ కోసం పరుగులు తీస్తుండటం విశేషం. ధర రూ.1,200 దాటినా సరే వెనకాడడం లేదు.

చదవండి: (Huzurabad Bypoll: సింబల్‌ హడల్‌!)

రాత్రికి విందు తప్పనిసరి
ఉప ఎన్నిక పుణ్యమాని అన్ని పార్టీలకు చెందిన నాయకులంతా ఇక్కడే తిష్టవేశారు. వీరిలో జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఉన్నారు. వీరిలో చాలామంది రాత్రిపూట మందు పార్టీలకు హాజరవుతున్నారు. కొందరికి నేరుగా గదులకే బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ అక్టోబరు 1 నుంచి 9 వరకు రూ.6.17 కోట్ల విలువైన మద్యాన్ని నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజూరాబాద్‌ మండలాల్లో విక్రయించారని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. జమ్మికుంటలో రూ.2.63 కోట్లు, హుజూరాబాద్‌లో రూ.3.54 కోట్ల మద్యం విక్రయించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ స్థాయిలో వ్యాపారం చేయడం స్థానికంగా మద్యానికి పెరిగిన డిమాండ్‌కు నిదర్శనమని లిక్కర్‌ వ్యాపారులు తెలిపారు. 

జోరుగా ట్రావెల్స్‌ బుకింగ్స్‌
కరోనా కారణంగా బాగా నష్టాల్లో ఉన్న స్థానిక ట్రావెల్స్‌ యజమానులు ఉప ఎన్నిక పుణ్యమాని బిజీ అయిపోయారు. ఒక్కో కారును రూ.25,000 నుంచి రూ.35,000 వరకు లీజుకు తీసుకుంటున్నారు. హుజూరాబాద్‌ వచ్చిన నాయకులను ప్రచారానికి తిప్పడమే వీరు చేయాల్సిన ఏకైక పని. పలు పార్టీల నాయకులు, అభ్యర్థులు ఇక్కడ వాహనాలను ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు బుక్‌ చేసుకోవడంతో వీరంతా చేతి నిండా పనితో రేయింబవళ్లు కష్టపడుతున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top