రేవంత్‌కన్నా నాకే క్రేజ్‌ ఎక్కువ ఉంది.. | VH Hanumantha Rao Fires On Revanth Reddy Over TPCC Chief Selection | Sakshi
Sakshi News home page

మాణిక్కం ఠాగూర్‌ ప్యాకేజీకి అమ్ముడుపోయారు..

Dec 25 2020 1:29 PM | Updated on Dec 25 2020 2:31 PM

VH Hanumantha Rao Fires On Revanth Reddy Over TPCC Chief Selection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పీసీసీ అధ్యక్ష‌ పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్‌ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అటు ఢిల్లీలోనూ.. ఇటు హైదరాబాద్‌లోనూ రేవంత్ పేరే ప్రముఖంగా వినపడుతోంది. ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా దాదాపు ఖరారు అయ్యారని, అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమని తెలుస్తోంది.

దీంతో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై  మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకత్వ బాధ్యతలు టీడీపీ నుంచి వచ్చి న రేవంత్‌కు అప్పగించడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చారని విమర్శించారు. అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌ పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్‌ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మాట్లాడారు. చదవండి: టీపీసీసీ చీఫ్‌ ఎంపిక దాదాపు పూర్తి!

కాంగ్రెస్‌లో తాను సీనియర్‌ అని వీహెచ్‌ హనుమంతరావు అన్నారు. గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నానని, ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఏం సంపాదించుకోలేదన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకూ సోనియాగాంధీని కలవడానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, కావాలనే కలవకుండా ఒక సెక్షన్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంపై హైకమాండ్ ఆలోచన చేయాలన్నారు. తనకు ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వారని వీహెచ్‌ సూటిగా ప్రశ్నించారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఓటమిపై రివ్యూ ఎందుకు చేయరని నిలదీశారు. రేవంత్ మాస్ లీడర్ అయితే, గ్రేటర్‌లో 48 సీట్లు తీసుకొని 2 స్థానాలు మాత్రమే గెలిచిందని ఎద్దేవా చేశారు. ఆయన టీడీపీని ఖతం పట్టించి, కాంగ్రెస్‌లో పడ్డారని ఎద్దేవా చేశారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు చరిత్ర చూస్తారు కానీ రేవంత్ చరిత్ర ఎందుకు చూడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమని పిలిచి మాట్లాడాలని అన్నారు. లేదని  అధిష్టానం నిర్ణయం తీసుకుంటే... తమ నిర్ణయం తాము తీసుకుంటామని హెచ్చరించారు. 

‘మీడియా, సోషల్ మీడియాతోనే రేవంత్ లీడర్ అయ్యాడు. పీసీసీ విషయంలో సమాచారం ఉన్నందుకే మాట్లాడుతున్నాను. అభిప్రాయ సేకరణలో నేను ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి చేరకుండా ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్ అడ్డుకున్నాడు. ఆయన అధిష్టానానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ప్యాకేజీకి అమ్ముడుపోయాడు. రేవంత్ తమ్ముడు.. దళితుల భూమి కబ్జా చేస్తే మీడియా ఎందుకు రాయదు. రేవంత్ మీడియాను పార్టీ హైకమాండ్‌ను మేనేజ్ చేస్తున్నాడు. రేపటి నుంచి టీఆర్‌ఎస్‌ తెలంగాణ వ్యతిరేకిని పీసీసీ చీఫ్‌ చేశారని ప్రచారం చేస్తుంది. మేం ఆయనను కలవడానికి జైలుకు పోవాలా. ఈ వాస్తవాలను వివరిస్తూ లెటర్ రాసినా. మాస్ లీడర్ అయితే కొడంగల్‌లో రేవంత్‌ ఎందుకు ఓడిపోయాడు. మూడు రోజుల నుంచి నా ఫోన్‌ను మాణిక్కం ఠాగూర్ ఎత్తడం లేదు. బీసీగా ఉన్న డీ శ్రీనివాస్‌ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేశాడు. అలాంటి వ్యక్తికి ఇవ్వాలి’ అని సూచించారు. 

గతంలో ఎంఐఎంతో పొత్తు పెట్టించాడని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాగ్రౌండ్ ఉన్నోడికి ఇవ్వమంటరా అని మండిపడ్డారు. కొందరు పైసలకు అలవాటు పడి భజన చేస్తున్నారని, రేవంత్ వద్ద పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దీనిపై సీబీఐకి లేఖ రాస్తాననని అన్నారు. రేవంత్ ఊరికి పోయి ఆయన చరిత్ర బయటికి తీస్తానని సవాల్‌ విసిరారు. చివరిసారి అడుతున్నానని.. తామంటే లెక్కలేదా.. పీసీసీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పీసీసీ పదవి రెడ్డిలకు ఇవ్వాలనుకుంటే అసలైన రెడ్డికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భట్టి విక్రమార్క పదవి నుంచి తీస్తారని అంటున్నారు. ఆయన్ను ఎందుకు తీస్తారు అని వీహెచ్‌ ప్రశ్నించారు. ఇవాళ ఉదయం కూడా  పొన్నం ప్రభాకర్‌, భట్టి విక్రమార్క అందరితో మాట్లాడినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement