చవితి పండుగపై ఏ ఆంక్షలూ లేవు.. తప్పుడు సమాచారంపై వెలంపల్లి శ్రీనివాస్‌ ఫైర్‌

Vellampalli Srinivas Comments On Vinayaka Chavithi Celebrations - Sakshi

గుళ్లు కూల్చే వారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు 

మండపాలకు అనుమతులు గతంలో కంటే సులభతరం చేశాం 

గతంలో నాలుగు శాఖల పర్మిషన్‌ తీసుకోవాల్సి వచ్చేది 

ప్రస్తుత ప్రభుత్వం సింగిల్‌ విండో విధానం తెచ్చింది 

చీకట్లో ఆలయాలు కూల్చిన నీచ సంస్కృతి ప్రతిపక్షాలది 

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, అమరావతి: వినాయక చవితి నిర్వహణపై ప్రభుత్వం ఏ ఆంక్షలూ విధించలేదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ స్పష్టంచేశారు. పైగా, గణేష్‌ మండపాల అనుమతిని సులభతరం చేశామని తెలిపారు. గతంలో అగ్నిమాపక, పోలీసు, విద్యుత్‌ శాఖలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతి కోసం వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సింగిల్‌ విండో విధానాన్ని తెచ్చిందని తెలిపారు.

మండపాల రుసుము ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నామని చెప్పారు. పైగా గత టీడీపీ ప్రభుత్వంలో 250 వాట్స్‌ వరకు విద్యుత్‌ వినియోగానికి రూ.1,000 చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు దాన్ని రూ.500కు తగ్గించామని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితిపై ప్రభుత్వం నిబంధనలు విధించిందంటూ టీడీపీ ఆఫీసు నుంచి సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారని చెప్పారు.

వాటన్నింటిపై దేవదాయ శాఖ మంత్రి, డీజీపీ, అధికారులు కూడా వివరణ ఇచ్చారని తెలిపారు. అయినా సోము వీర్రాజు, టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ ఆఫీస్‌ స్క్రిప్టును  సోము వీర్రాజు, ఇతర బీజేపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. చీకట్లో ఆలయాలను ధ్వంసం చేసిన నీచ చరిత్ర ఆనాటి టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షానిదని అన్నారు. ఆలయాలు కూల్చి, విగ్రహాలను ధ్వంసం చేసి, రథాలు తగులబెట్టే వారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పార్టీల నేతలకు చెప్పారు.

నిందలు మానాలి 
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో విపక్షాలకు దిక్కుతోచడం లేదని చెప్పారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు వాస్తవాలు గ్రహించి, ప్రభుత్వంపై నిందలు మానాలని చెప్పారు. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ను ఒక  మతానికి పరిమితం చేయొద్దని కోరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top