అభివృద్ధి మంత్రాన్ని వదిలి.. మళ్లీ ‘హిందుత్వ’ జపమెందుకో!

Uttar pradesh assembly election 2022: BJP Hindutva agenda in UP - Sakshi

ఏదైనా తేడా కొడుతోందనే సమాచారం ఉందా?

ఐబీ నివేదికలు, అర్‌ఎస్‌ఎస్‌ సర్వేల్లో ఇలాంటివి వచ్చాయా?

హిందువుల ఓట్లను 2017 లాగా సంఘటితం చేయడం

సాధ్యం కాదని ముందే గ్రహింపు

అయినా సరే... ఇప్పుడు మళ్లీ హిందుత్వ పాట

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎందుకు తమ వ్యూహాన్ని మార్చేసి... మళ్లీ హిందుత్వ జపం చేస్తోంది. మొదట అభివృద్ధి మంత్రం పఠించి... ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి ముందే యూపీలో ప్రాంతాల వారీగా భారీ స్థాయిలో ప్రధాని చేత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించిన కమలదళం తీరా సెమీఫైనల్‌ (దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. దీన్ని సెమీఫైనల్‌గా అభివర్ణిస్తారు.

భారత భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని యూపీ ఫలితాలు ప్రతిబింబిస్తాయనేది రాజకీయ పండితుల అభిప్రాయం) మొదలయ్యే నాటికి ఎందుకు రూటు మార్చేసింది. మళ్లీ హిందుత్వ ఎజెండాను ఎందుకు బలంగా ఎత్తుకుంది. అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదని గట్టి సంకేతాలు అందాయా? అందుకే మళ్లీ పాతపాటే ఎత్తుకుందా? యూపీలో రెండు దశల ఎన్నికలు ముగిశాక తాజా పరిస్థితి ఎలా ఉందనే దానిపై సవివర కథనం...

సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా 2013లో పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో జాట్లు– ముస్లింలకు మధ్య ఘర్షణలు  చెలరేగాయి. 60 మంది దాకా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. ముస్లిం వేధింపులు పెరగడంతో 2014–16 దాకా కైరానా నుంచి హిందూ కుటుంబాలు అభద్రతాభావంతో భారీగా వలసవెళ్లాయి. ఈ రెండు అంశాలనూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయవంతంగా వాడుకుంది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలు కాకుండా ఒక్క బీజేపీయే ఏకంగా 312 సీట్లతో జాక్‌పాట్‌ కొట్టింది. అయితే 2022 ఎన్నికలు ఆరు నెలల ముందు నుంచే యూపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. హిందుత్వ కార్డు ఈసారి పనికిరాదనుకున్న బీజేపీ.. ముందస్తు వ్యూహంతో అభివృద్ధి మంత్రాన్ని జపించింది. ఏకంగా సుమారు లక్ష కోట్లకు పైగా విలువైన పనులకు కొబ్బరికాయలు కొట్టింది. రహదారులు, ఎయిర్‌పోర్టులు, విశ్వ విద్యాలయాలు, ఎరువుల కార్మాగారాలు దేన్నీ వదలకుండా ఓట్లను రాబట్టే ప్రధాన రంగాల్లో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు రిబ్బన్‌కటింగ్‌లు చేసి, పునాదిరాళ్లు వేసింది.  
రెండు నెలల్లో యూపీలో 16 ర్యాలీల్లో

పాల్గొన్న ప్రధాని
గత ఏడాది అక్టోబర్‌ నుంచి జనవరి 8న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా 16 పెద్ద ర్యాలీల్లో స్వయంగా పాల్గొని ఎన్నికల హీట్‌ను పెంచే ప్రయత్నం చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌లు ప్రతి మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిలో ర్యాలీ లేదా రోడ్‌–షో నిర్వహించారు. అసెంబ్లీ స్థానాలపరంగా చూస్తే ఈ ముగ్గురూ యూపీలోని 403 సీట్లలో 68 శాతం సీట్లు అనగా 275 నియోజకవర్గాలను చుట్టేశారు.. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలకుగాను 47 జిల్లాల్లో 112 సభలు, ర్యాలీలు జరగగా, అందులో మోదీ 16, అమిత్‌ షా 20, యోగి ఆదిత్యనాథ్‌ 76 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఏక్‌ ఔర్‌ ధక్కా.. కుర్చీ పక్కా!
çపశ్చిమ యూపీలో సమాజ్‌వాదీ– రాష్ట్రీయ లోక్‌దళ్‌ జట్టుకట్టడంతో ఈనెల 10వ తేదీన పశ్చిమ యూపీలో 58 స్థానాలకు జరిగిన తొలిదశ పోలింగ్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. పశ్చిమ యూపీ 26 శాతానికి పైగా ముస్లింలు, 3.5 శాతం జాట్లు ఓట్లు ఉండటం, వీరికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా సగటున 10 శాతం ఉన్న యాదవ ఓట్లలో సింహభాగంగా ఎలాగూ ఎస్పీ కూటమికే పడతాయి. దానికి ఓబీసీల్లోని కొన్నివర్గాలు తోడైతే బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా అవతరించిన ఈ కూటమికి 45 శాతం పైచిలుకు ఓట్లు సునాయాసంగా పడతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే  తొలి దశలో 62.4 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదు కావడంతో ప్రభుత్యానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు ఓటింగ్‌కు ముందుకు రాలేదని కొందరు వాదించారు.

మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా జరిగిన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పశ్చిమ యూపీ రైతులు ఓటింగ్‌ వచ్చేసరికి ఆ స్థాయి పట్టుదలను చూపలేదని అభిప్రాయపడ్డారు. అయితే సోమవారం బీజేపీకి స్వల్ప మొగ్గున్న రెండోదశలోని 55 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లోనూ 60.44 ఓటింగ్‌ శాతమే నమోదు కావడం గమనార్హం. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలతలు దాదాపు సమంగా ఉన్నట్లు భావించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ లేదా కూటమి కనీసం 2 నుంచి 3 శాతం అధిక ఓట్లు సాధిస్తే.. విజయతీరాలకు చేరే అవకాశాలుంటాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అంటే ఎవరైతే మిగిలిన ఆరు దశల్లో సర్వశక్తులూ ఒడ్డి ‘ఏక్‌ ఔర్‌ ధక్కా’ అంటారో.. వారికి అధికార పీఠం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించొచ్చు.

మొదటి దశ కాగానే.. హిందుత్వ వాడిని మరింత పెంచిన బీజేపీ
మథురలో ఆలయం కడతామంటూ ఎన్నికలకు కొద్దినెలల ముందు కొత్త పల్లవి అందుకున్న బీజేపీ.. ఈ నెల 10çన తొలిదశ తర్వాత హిందుత్వ వాడివేడిని మరింతగా పెంచేసింది. గతంలో ఎస్పీ హయాంలో ‘అబ్బా జాన్‌ (ముస్లింను ఉద్దేశించి)’ అనే వారికే రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలన్నీ అందేవని వ్యాఖ్యానించడం ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మతపరమైన ఎజెండాను మరింతగా ముందుకుతెచ్చారు. ఆపై 80–20 (ఉత్తరప్రదేశ్‌ జనాభాలో హిందువులు– ముస్లింల నిష్పత్తి) మధ్య యుద్ధంగా 2022 అసెంబ్లీ ఎన్నికలను అభివర్ణించారు. ప్రధాని మోదీ కూడా ఉత్తరాఖండ్‌ ప్రచారంలో శనివారం మాట్లాడుతూ... దేవభూమి అయిన ఈ రాష్ట్రంలో ముస్లిం యూనివర్శిటీని పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆరోపించారు.

ఇలా హిందువుల ఓట్లను సంఘటితం చేయడానికి ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతలంతా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిఘా సమాచారం, కేంద్రంలోని ఇంటలిజెన్స్‌ బ్యూరో పకడ్బందీగా ఇచ్చే ఫీడ్‌బ్యాక్, వాస్తవ సరిస్థితులను ప్రతిబింబించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చే నివేదికలు, బీజేపీ పార్టీపరంగా అందే రిపోర్టులు, స్వతంత్ర సంస్థలతో చేయించే సర్వేలు.. ఇలా బీజేపీకి ఇన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో ఏం జరగుతోందనే సమాచారం అందుతుంది. వీటిల్లో అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదని పక్కా సమాచారం ఉండటంతోనే మరోదారి లేక బీజేపీ మళ్లీ హిందుత్వ నినాదాన్ని (ఈసారి పనిచేయడం లేదని తెలిసీ) అందుకొని ఉండొచ్చనేది కొందరు రాజకీయ పండితుల అంచనా.     

 – నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top