టీఆర్‌ఎస్‌ కుట్రలను ఛేదిస్తాం

Uttam Kumar Reddy Comments On TRS Party - Sakshi

బోగస్‌ ఓట్లు, డీలిమిటేషన్‌పై పోరాటం

గ్రేటర్‌లో విజయం మనదే

గ్రేటర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బోగస్‌ ఓట్లతో, అక్రమ డీలిమిటేషన్‌ ప్రక్రియతో గెలవాలని అధికార టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్‌ నాయకులు అప్రమతంగా ఉండాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ కుట్రలను ఛేదించి గ్రేటర్‌ ఎన్నికల్లో విజ యం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఇందిరాభవన్‌లో గ్రేటర్‌ కాంగ్రెస్‌ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ నగరంలో బోగస్‌ ఓట్లను చేర్పించి లబ్ధి పొందాలని టీఆర్‌ఎస్‌ యత్నిస్తోందని, ఒక్కో డివిజన్‌లో ఒక్కో రకంగా ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా నగర కాంగ్రెస్‌ నాయకులు పోరాటం చేయాలని కోరారు. 150 డివిజన్లలో కాంగ్రెస్‌ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని, నాయకులు గడప గడపకూ తిరిగి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌ పాలన పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని, ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం ఖాయమని అన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. డివిజన్ల డీలిమిటేషన్, ఓట్ల చేర్పులో కాంగ్రెస్‌ నేతలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మేయర్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారని, మళ్లీ డివిజన్‌ రిజర్వేషన్లు మారుస్తారా అన్నది పరిశీలించాలని సూచిం చారు. 150 డివిజన్లలో ముఖ్య నాయకులను, ప్రధానంగా యువకులను గుర్తించి గడపగడపకూ పాదయాత్ర చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, మర్రి శశిధర్‌ రెడ్డి, ఫిరోజ్‌ ఖాన్, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లు, 40 బ్లాక్‌ అధ్యక్షుల సమావేశం ఇందిరా భవన్‌లో గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ సమన్వయకర్తగా జరుగుతుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ తెలిపారు. 

దుబ్బాక.. దరిచేరేదెలా..?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసిం ది. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో కీలక నేతలతో సమావేశమై దుబ్బాక ఉప ఎన్నికపై చర్చించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సిం హ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా టికెట్‌ ఆశిస్తున్న నలుగురు ఆశావహులతో సమావేశమై ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి మాట్లాడారు. ఉప ఎన్నికల బరిలో దూకుడుగానే వ్యవహరించాలని, ఈనెల 11న నియోజకవర్గ పరిధిలోని గ్రామస్థాయిలో నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు.

ఈ సమావేశం అనంతరం ఆశావహుల తో మరోమారు మాట్లాడి ఉత్తమ్‌ ఈనెల 13న జా బితాతో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టికెట్‌ ఆశిస్తున్న వారిలో గతంలో మెదక్‌ ఎంపీగా పోటీ చేసిన శ్రావణ్‌ కుమార్‌రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రావు ఉన్నారని తెలుస్తోంది. ఉత్తమ్‌ తుది జాబితాతో ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈనెల 17 లేదా 18న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top