రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్‌ | Uttam Kumar Reddy Comments On BRS Leader KTR | Sakshi
Sakshi News home page

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్‌

May 22 2026 5:24 AM | Updated on May 22 2026 5:24 AM

Uttam Kumar Reddy Comments On BRS Leader KTR

కొనుగోళ్ల ప్రక్రియలో రైతు మరణించాడని అబద్ధపు ప్రచారం: మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతు మరణించారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అబద్ధాల రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారని మండిపడ్డారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా మరణించలేదన్నారు. రాజకీయ లాభాల కోసం బురదచల్లే ప్రయత్నమే తప్ప.. కేటీఆర్‌ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీటి రంగాన్ని కుంభకోణాల కూపంగా మార్చిన నాయకులు ఇప్పుడు రైతు సంక్షేమంపై మాట్లాడడం విడ్డూరమన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందని ఉత్తమ్‌ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కూడా సరికొత్త రికార్డులు నమోదయ్యాయని చెప్పారు. 2025–26 రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటివరకు 54.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరిందన్నారు. అందులో 46.21 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇందుకుగాను 6.3 లక్షల మంది రైతులకు రూ.7,841 కోట్ల చెల్లింపులు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 18.3 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేశామని, రవాణా కోసం 13 వేల వాహనాలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతుండటాన్ని తట్టుకోలేక బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement