
సాక్షి, హైదరాబాద్: కుల గణనపై చర్చకు సిద్ధమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సర్కార్ చేసింది కుల గణన కాదని.. కుల సర్వే మాత్రమే చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సర్వే కూడా తూతూ మంత్రంగా చేశారు. మేము ఎప్పుడు కుల గణనను వ్యతిరేకించలేదు. బీసీలకి న్యాయం జరిగేలా సరైన గణన చేయాలని కోరాం’ అని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
‘‘ముస్లింలను బీసీలలో కలిపి అసలైన బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పాం. దేశంలో స్వాతంత్య్రం వచ్చాక కుల గణన చేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీది. 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనలో మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో ఎన్డీయే హయాంలో రోడ్ల కనెక్టివిటీ బాగా పెరిగింది. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో రోడ్ల నిర్మాణం జరిగింది. హైవే రోడ్లకు కనెక్టివిటీ చేయడం జరిగింది. 2014 తెలంగాణలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులుంటే ఇవాళ 5200 కిలోమీటర్ల జాతీయ రహదారులు పెరిగాయి’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం 1 లక్ష 20 కోట్ల నిధులను కేవలం రోడ్ల నిర్మాణంపై ఖర్చు చేస్తోంది. హైదరాబాద్‌కు అన్ని వైపుల అత్యాధునికంగా, అన్ని సౌకర్యాలతో జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఫోన్ లైన్ ఎలివేటెడ్ హైవే ప్రతిపాదనలో ఉంది. భూసేకరణ కాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం నత్తనడకన జరుగుతున్నాయి. జాతీయ రహదారులకు కావలసిన ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు పూర్తవుతాయి. 6వేల కోట్ల నిధులతో తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి.
5 కారిడార్లకు లక్ష కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో రూ. 5416 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్ రెండు చోట్ల వివిధ జాతీయ రహదారులకు భూమి పూజ చేయనున్నారు. ఆదిలాబాద్‌లో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద 5 ప్రాజెక్ట్ లు, హైదరాబాద్‌లో బీహెచ్‌ఈఎల్ వద్ద ఫ్లై ఓవర్, అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తారు. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగే సభలో ప్రసంగిస్తారు’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.