Yanamala Brothers: అన్నదమ్ముల అస్త్రసన్యాసం!

Tuni Yanamala Brothers TDP Chandrababu YSRCP East Godavari - Sakshi

ప్రజల ఛీత్కారంతో డోలాయమానం 

వయసుమీరిందంటూ కుంటి సాకులు 

ఏడాదిన్నర ముందే పోటీకి వెనకడుగు 

తునిలో యనమల సోదరుల వైరాగ్యం  

సాక్షి, కాకినాడ: ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. వరుస పరాజయాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్య నేతలు సైతం వైఎస్సార్‌ సీపీ సంక్షేమ పాలన ముందు మళ్లీ పోటీకి వెనుకంజ వేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దయనీయ పరిస్థితులపై టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తు అంతా మనదేనంటూ ఊరూవాడా ప్రచారంతో హంగామా చేస్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం యుద్ధానికి ముందే అ్రస్తాలు వదిలేస్తున్నారు. వరుస ఓటములకు తోడుగా భవిష్యత్తు ఫలితాలు కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుండటంతో రాజకీయ కురువృద్ధులు సైతం పునరాలోచనలో పడ్డారు. పోటీ అంటే ససేమిరా అంటున్నారు. నేరుగా ఈ విషయం చెప్పలేక చేస్తోన్న వ్యూహాత్మక వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. పోటీ చేయడానికి ధైర్యం చాలక కుంటిసాకులు వెతుక్కుంటున్నారని ఆ పార్టీలోని అసమ్మతి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. 

ఇప్పుడు ముచ్చెమటలు 
టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్‌–2గా చలామణీ అయ్యే ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పక్షాన చక్రం తిప్పారు. తెర వెనుక రాజకీయాల్లో ఈయన్ను ఎదుర్కొనేందుకు చాలాకాలం రెండు గ్రూపులు  కూడా నడిచాయి. అటువంటి నాయకుడికే వైఎస్సార్‌ సీపీ ప్రజా సంక్షేమ పాలనతో ముచ్చెమటలు పడుతున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో  ఓటమి తప్పదనే భయం ఈ నాయకుడిని వెంటాడుతోంది.

తాను పుట్టి పెరిగి, రాజకీయంగా ఇప్పుడున్న స్థాయికి కారణమైన సొంత నియోజకవర్గం తుని నుంచి..తాను, వరుసకు సోదరుడైన కృష్ణుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ శ్రేణులకు ఇటీవల రామకృష్ణుడు  పరోక్ష సంకేతాలు పంపించారు. ఇవి నియోజకవర్గంతోపాటు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రెండు రోజుల క్రితం తునిలో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా రామకృష్ణుడు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పడం గమనార్హం. 70 సంవత్సరాలు వయసు దాటింది.. కృష్ణుడికి కూడా కాస్త అటు ఇటుగా వయస్సు మీరింది..ఈ పరిస్థితుల్లో  వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీచేసినా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తల సమావేశంలోనే యనమల  ప్రకటించారు.

రామకృష్ణుడి వ్యాఖ్యలను పార్టీ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు అ న్వయించుకుంటున్నారు. యువకులకు అవకాశం కల్పించాలని తానే చంద్రబాబును కోరినట్టు, అందుకు ఆయన సరేనన్నట్టు కూడా ఈ నేత చెప్పుకొచ్చారు. సీనియారిటీ, వయసు మీరడమనేది రాజకీయాల్లో అసలు ప్రశ్నే కాదనే విషయం రాజకీయాలపై ఏ కొద్దిపాటి అవగాహన ఉన్న వారిని అడిగినా ఇట్టే చెబుతారు. టీడీపీలో అపర చాణుక్యుడిగా చెప్పుకునే యనమల అంత పెద్ద మాటలు మాట్లాడారంటే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఈ మాటల వెనుక మర్మం ఏమిటంటూ తెలుగు తమ్ముళ్లు ఎవరి స్థాయిలోవారు అంచనాలు వేస్తున్నారు.  

నాటి అరాచకాలు ఇంకా కట్టెదుటే.. 
అధికారంలో ఉన్నన్నాళ్లు తునిలో సాగించిన అరాచక పాలనతో యనమల సోదరులు ప్రజల ఛీత్కారానికి గురయ్యారు. రామకృష్ణులను వరుసగా మూడు పర్యాయాలు ఓడించిన తరువాత కూడా అక్కడి ప్రజలు గత జ్ఞాపకాలను మరచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం చాలక రామకృష్ణుడు 2009 తరువాత  ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.

అయినా ఆశను వదులుకోలేక తన రాజకీయ వారసుడిగా (వరుసకు సోదరుడు) కృష్ణుడ్ని తుని నుంచి బరిలోకి దింపారు. రామకృష్ణుడి తరువాత వరుసగా రెండు పర్యాయాలు 2014, 2019లలో బరిలోకి దిగిన కృష్ణుడిని తుని ప్రజలు ఓడించారు.  వరుస ఓటములు, గడచిన మూడున్నరేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన వెరసి తునిలో యనమల సోదరులకు రాజకీయ భవిష్యత్తు లేదనే అంచనాలే రామకృష్ణుడు నోటితో ఆ మాటలు పలికించాయనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.  

ఈ మాటలు సాకులే.. 
1983 నుంచి వరుసగా రామకృష్ణుడు తునిలో ఆరు పర్యాయాలు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఓటమి తరువాత తుని నుంచి పోటీ చేసే సత్తా లేక చేతులెత్తేసి ఆయన ఇక్కడి రాజకీయాలకు దూరమయ్యారు. సందర్భోచితంగా బంధువులు, సన్నిహితుల శుభ కార్యాలకు రావడం తప్పితే సొంత నియోజకవర్గ రాజకీయ వ్యవహారాలకు దాదాపు ముఖం చాటేశారని చెప్పొచ్చు.  ఈ నాయకుడు ఇంత  హఠాత్తుగా తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.

ఒకవేళ పార్టీపై అభిమానంతో ఏర్పాటు చేశారనుకున్నా, వయసు మీరిందని సాకులు చెబుతూ యువకులకు అవకాశం కల్పించాలంటూ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏమై ఉంటుందా అనే కోణంలో కూడా తమ్ముళ్లు ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గుకు రావడం కలే అనే నిర్థారణకు రావడంతోనే వయస్సును సాకుగా చూపిస్తున్నారని తెలుస్తోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో యనమల పలికిన నాలుగు పలుకులు టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top