స్టేట్‌.. సెంటర్‌.. సెప్టెంబర్‌ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్‌

TRS And BJP Will Organise Competitive Programs On September 17th - Sakshi

పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించనున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 

తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణకు టీఆర్‌ఎస్‌ సర్కారు సిద్ధం 

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణకు కేంద్ర సాంస్కృతిక శాఖ సన్నాహాలు 

అమిత్‌ షా, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు పాల్గొనే అవకాశం 

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో కవాతు 

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొందిన రోజు. ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఈ నెల 17న ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
చదవండి: బీజేపీ దూకుడుకు చెక్‌ పెట్టేలా..

ఈ మేరకు శనివారం నాటి కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున అధికారికంగా మళ్లీ తెలంగాణ విలీన దినం నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. ఇప్పటివరకు కేవలం పార్టీ కార్యాలయంలో మాత్రమే టీఆర్‌ఎస్‌ జాతీయ జెండా ఆవిష్కరిస్తూ వస్తోంది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆ రోజు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వేడెక్కిన రాజకీయం.. ఈ నెల 17న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోటా పోటీ ఉత్సవాలతో మరింత వేడెక్కే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top