
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. తాను కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. బెంగాల్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు 50 స్థానాల్లో పోటీ చేస్తుందని బాంబు పేల్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
భరత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. ఇటీవలి కాలంలో పార్టీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నేతలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యే కబీర్‌ను హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలను వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు కబీర్ ప్రకటించారు.
Trinamool Congress (TMC) MLA, Humayun Kabir, has announced the formation of a new political party NTMC (No TMC) 🎃
# News is true, party name is #Satire pic.twitter.com/HpJMmUDGSU— The Story Teller (@IamTheStory__) July 24, 2025
టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పట్ల నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ, కొందరు నేతలు నన్ను టార్గెట్ చేశారు. అందుకే నేను పార్టీని వీడాలనుకుంటున్నాను. జనవరి 1, 2026వ తేదీన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నాను. మన పార్టీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 50 నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. నా కొత్త పార్టీ ముర్షిదాబాద్‌కు మాత్రమే పరిమితం కాదు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, నదియాలోని కొన్ని ప్రాంతాలలో 50–52 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక, హుమాయున్ కబీర్ మైనారిటీలు ఎక్కువగా ఉండే భరత్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్‌లో ఆయన కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో, ఆయన కొత్త పార్టీ.. అధికార టీఎంసీకి ఓట్లను చీల్చే అవకాశం ఉంది.