17న గజ్వేల్‌లో కాంగ్రెస్‌ సభ

Tpcc Has Decided To Hold A Meeting In Gajwel On The 17th Of This Month - Sakshi

దళిత, గిరిజన ఆత్మగౌరవ ప్రతీకగా నిర్వహించాలని టీపీసీసీ 

ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం

అంతకంటే ముందు వీలుంటే కరీంనగర్‌లో మరో సభ

కోఆర్డినేటర్ల పనితీరుపై వర్కింగ్‌ ప్రెసిడెంట్లు నివేదికలివ్వాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 17వ తేదీన గజ్వేల్‌లో సభ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌లో భారీ సభ నిర్వహించాలని ఆ పార్టీ ముఖ్య నాయకులు తీర్మానించారు. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేనీలు హాజరయ్యారు.

దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంపై చర్చించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగిన తీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆశించిన స్థాయిలోనే నిర్వహించామని అభిప్రాయపడ్డ నేతలు, కార్యక్రమ నిర్వహణ కోసం నియమించిన అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సమన్వయకర్తల పనితీరుపై నివేదికలు ఇవ్వాలని పార్లమెంటు ఇన్‌చార్జులుగా ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్లను ఆదేశించారు. సెప్టెంబర్‌ 17న కార్యక్రమం ముగింపు సందర్భంగా గజ్వేల్‌లో సభ నిర్వహించాలని, అంతకంటే ముందే వీలును బట్టి కరీంనగర్‌లో మరోసభ నిర్వహించా లని నిర్ణయించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వాయిదాపై కూడా చర్చ జరిగింది. అక్టోబర్, నవంబర్‌ వరకు ఉప ఎన్నిక జరిగే వీలు లేనందున పార్టీ అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై ఆచితూచి ముందుకెళ్లాలని నిర్ణయించారు.  

కేసీఆర్‌కు హుజూరాబాద్‌ భయం..
సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, దళితబంధు పథకంపై దళితుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి కేసీఆర్‌ను ముంచడం ఖాయమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని తాము చెప్పే మాటలకు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనతో బలం చేకూరిందని అన్నారు. ముఖ్యమంత్రికి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక భయం పట్టుకుందని, కోవిడ్‌ సాకు చూపి ఉప ఎన్నికను వాయిదా వేయించుకున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆడే డ్రామాలో రాష్ట్ర బీజేపీ నేతలు పావులుగా మారారని ఆయన ఎద్దేవా చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top