బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు  | TPCC Chief Revanth reddy Sensational Comments On CM KCR | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు 

Aug 21 2022 3:13 AM | Updated on Aug 21 2022 9:49 AM

TPCC Chief Revanth reddy Sensational Comments On CM KCR - Sakshi

గిరిజనులతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి 

చౌటుప్పల్‌/సంస్థాన్‌ నారాయణపురం: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలని, రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి కోసమే మునుగోడు ఉపఎన్నిక అయితే..బీజేపీ నాయకత్వం తక్షణమే తమ నలుగురు ఎంపీలతో రాజీనామా చేయించి తిరిగి ఆ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

ఉపఎన్నికలతో నిధుల వరద పారితే ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో మునుగోడు ఎన్నికపై శనివారం కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాది నుంచి వచ్చిన బీజేపీ నేత రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, నేతల కొనుగోళ్ల విషయంలో హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించిన బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ మునుగోడులో చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మునుగోడులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాయని తెలిపారు. బీజేపీకి రాముడు ఆదర్శం కాదని, కేసీఆర్‌ ఆదర్శంగా మారారని ఎద్దేవా చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, డిండీ ఎత్తిపోతల పథకానికి రూ.ఐదు వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు మునుగోడు ఆత్మగౌరవ సభలో అమిత్‌షా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తాను ప్రచారం చేస్తానన్నారు. అంతకుముందు మున్సిపాలిటీ పరిధి తంగడపల్లి గ్రామంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ మధుయాష్కిగౌడ్, మాజీ మంత్రులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, జి.చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

పోర్లగడ్డతండాలో ఇంటింటికీ పండ్లు అందజేత 
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డతండాలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తండాలో ఇంటిఇంటికీ తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీ ముద్ర ఉన్న సంచిలో పండ్లును రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ‘‘నేను రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీ పెద్ద మనిషిని’’అంటూ పరిచయం చేసుకుని గిరిజనులతో ముచ్చటించారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ధర్మభిక్షం, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వంటి వారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మనుగడకు గిరిజనులు అండగా నిలిచారని గుర్తు చేశారు. పోడు భూములు సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని హామీనిచ్చారు. రేవంత్‌ వెంట పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పలువురు నాయకులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement