సోనియా గాంధీతో సీఎం స్టాలిన్‌ భేటీ  | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీతో సీఎం స్టాలిన్‌ భేటీ 

Published Sat, Jun 19 2021 2:19 PM

TN CM Stalin Meets Sonia Gandhi, Rahul Gandhi in Delhi - Sakshi

సాక్షి, చెన్నై: గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌ అగ్రనేతలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం కలుసుకున్నారు. సుమారు 30 నిమిషాలపాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాందీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీతో స్టాలిన్‌ భేటీ అయ్యారు.  తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం స్టాలిన్‌ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న స్టాలిన్‌ అదే రోజు సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తరువాత తమిళనాడు భవన్‌లో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న తమిళనాడు కేడర్‌ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో సంభాషించారు.

ఆ తరువాత సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజాలను కలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆ ముగ్గురితో వేర్వేరుగా మాట్లాడారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం స్టాలిన్‌ తన సతీమణి దుర్గా స్టాలిన్‌తో కలిసి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాందీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాం«దీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను కలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేసినందుకు రాహుల్‌గాంధీకి స్టాలిన్‌ ధన్యవాదాలు తెలిపారు. సుమారు 30 నిమిషాలపాటు వారు సమావేశమయ్యారు. రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగియడంతో శుక్రవారం మ ధ్యాహ్నం ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు. 

సుస్థిర ప్రభుత్వానికి సహకరిస్తాం– రాహుల్‌ 
తమిళనాడు ప్రజల కోసం బలమైన, సుస్థిరమైన పాలన అందించేందుకు సహకరిస్తామని.. డీఎంకేతో కలిసి పనిచేస్తామని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. సీఎం స్టాలిన్‌ దంపతులు కలవడం ఎంతో సంతోషకరమని, తమిళనాడు అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా సహకరిస్తామని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.    

Advertisement
Advertisement