వేడెక్కిన రాజకీయం.. నోటిఫికేషన్‌కు ముందే జోరుగా ప్రచారం

Telangana Teacher MLC Election Campaign Become Peaks before Notification - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నోటిఫికేషన్‌కు ముందే రసవత్తరంగా మారింది. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలు, మండలాల వారీగా పర్యటించి ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయ ఓటర్లను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయిస్తున్నారు.

ఒకవైపు ఓటర్లను ఆకర్షిస్తూనే.. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు. జిల్లాల వారీగా ఉన్న ముఖ్య నేతలతో సమావేశమై మద్దతు ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీఆర్‌టీయూ తెలంగాణ మద్దతుతో ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మళ్లీ బరిలోకి దిగుతుండగా, పీఆర్‌టీయూ టీఎస్‌ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్‌ నుంచి మాణిక్‌రెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు పోటీలో ఉన్నారు.  

మొదలైన ఓటర్ల నమోదు ప్రక్రియ 
2023 మార్చితో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ చివరి నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించి.. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెల్లడించనున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 33,116 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటికే 22 వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈనెల 9తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓటరు నమోదుపై దృష్టి సారించాయి. అభ్యర్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీల్లో పని చేస్తున్న అధ్యాపకులు, ప్రొఫెసర్లను స్వయంగా కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.  

రెండుగా చీలిపోయిన పీఆర్‌టీయూ
ఉపాధ్యాయ సంఘాల్లో పీఆర్‌టీయూ కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ సంఘానికి 72 వేలకుపైగా సభ్యత్వాలు ఉన్నాయి. 2014కు ముందే ఈ సంఘం రెండుగా చీలిపోయింది. కొంతమంది ఉపాధ్యాయులు మాతృసంస్థ పీఆర్‌టీయూ తెలంగాణ నుంచి విడిపోయి పీఆర్‌టీయూ టీఎస్‌గా ఏర్పడ్డారు. గతంలో ఈ రెండు సంఘాలు కలిసే అభ్యర్థిని ప్రకటించి, ఈ మేరకు గెలిపించుకున్నాయి.

పీఆర్‌టీయూ టీఎస్‌ రంగారెడ్డి జిల్లాకు చెందిన గుర్రం చెన్న కేశవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్న పీఆర్‌టీయూ తెలంగాణ ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పేరును మరోసారి ఖరారు చేసింది. వీరిద్దరూ గతంలో ఒకే సంఘంలో పని చేసిన వారే. ప్రస్తుతం కీలక నేతలిద్దరూ పోటీలో ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

317 జీఓ ఉపసంహరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనే అపవాదు ప్రస్తుత ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డిపై ఉంది. జిల్లాలోని మెజార్టీ ఉపాధ్యాయులు గుర్రం చెన్నకేశవరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఒకే ఉపాధ్యాయ సంఘం నుంచి చీలిపోయి ఇద్దరు పోటీలో ఉండటం ప్రత్యర్థులకు కలిసిరానుంది. ఇద్దరి మధ్యలో యూటీఎఫ్‌ అభ్యర్థికి సైతం గెలుపు అవకాశాలు ఉంటాయని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాలి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top