‘సంక్షేమం’లో రాష్ట్రం రోల్‌మోడల్‌

Telangana: Minister Harish Rao Addressing Meeting In Huzurabad - Sakshi

సిలిండర్‌ ధరలో రూ.291 రాష్ట్ర పన్ను ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా: హరీశ్‌రావు  

హుజూరాబాద్‌/ఎల్కతుర్తి: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పొనగంటి శ్రవణ్‌కుమార్‌ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరగా మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ అంటే వలసలు, బొగ్గుబాయి పని. ఇప్పుడు ఈ ఏడేళ్లలో ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు.

రైతుబంధు తెలంగాణ మోడల్‌. 24 గంటల ఉచిత విద్యుత్‌ తెలంగాణ మోడల్‌. రైతు బీమా తెలంగాణ మోడల్‌. టీఎస్‌ ఐపాస్‌ తెలంగాణ మోడల్‌. ఇది మనం చెబుతున్నది కాదు. కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్‌ సభ్యులే అంటున్నారు’ అని చెప్పారు. హుజూరాబాద్‌లో అరాచానికి.. అభివృద్ధికి మధ్య పోటీ నడుస్తోందని.. ఈటల మాటల్లో ఒక్క నీతివంతమైన మాట ఉందా? అని నిలదీశారు. ‘గ్యాస్‌ సిలిండర్‌ ధర బీజేపీ పాలనలో వెయ్యి రూపాయలకు పెరిగింది. రాజేందర్‌ మాట్లాడుతూ రాష్ట్ర పన్ను రూ.291 ఉందన్నారు. రూ.291 రాష్ట్ర పన్ను ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా. దీనిపై హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద చర్చకు వస్తావా’ అని సవాల్‌ విసిరారు. సిలిండర్‌ ధరను రూ.500కు తగ్గిస్తామని చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని పేర్కొన్నారు. 

హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపిస్తాం.. 
హుజూరాబాద్‌ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపిస్తే నియోజక వర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామ శివారులో జరిగిన వడ్డెర కుల ఆశీర్వాద సభలో హరీశ్‌ మాట్లాడారు. ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్‌ వింతగా మాట్లాడుతున్నాడని, నియోజకవర్గ ప్రజలకు గడియారాలు, కుక్కర్లు పంచిననాడే ఆయన ఆత్మగౌరవం మంటకలిసిందని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top