టీపీసీసీ చీఫ్‌.. తేలేనా? | Sakshi
Sakshi News home page

టీపీసీసీ చీఫ్‌.. తేలేనా?

Published Sun, Jun 13 2021 2:09 AM

​Telangana: Congress Party May Decides Tpcc President This Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఒకరి వెనుక ఒకరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో టీపీసీసీ అంశం మరోమారు చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ పదవిని ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి హస్తిన బాట పట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది. దీనికితోడు ఇటీవలే కేరళ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించడం, పంజాబ్‌లో పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించి కొత్త పీసీసీని ఎన్నుకునేందుకు కమిటీని ఏర్పాటు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్‌ సంగతినీ అధిష్టానం ఈసారి తేల్చేస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది. కానీ, దీనిపై గాంధీభవన్‌ వర్గాలు గుంభనంగానే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం స్థాయిలో మరిన్ని చర్చ లు జరగాల్సి ఉందని, ఆ తర్వా తే తేలుతుందని అంటున్నాయి. 
మూడు రోజులుగా అక్కడే..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై కేంద్ర పెద్దలను కలుస్తున్న ఆయన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కూడా అడిగినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా శుక్రవారం హస్తిన బాట పట్టడంతో అసలేం జరుగుతుందనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్‌లో మొదలైంది. అయితే, రేవంత్‌ కూడా తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఎలాగూ ఢిల్లీ వెళ్లారు కనుక పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశముందని అంటున్నారు. వీరికి తోడు మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఢిల్లీకి వెళ్లారని వార్తలు వచ్చినా అందులో నిజం లేదని అంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలందరితో మాట్లాడిన తర్వాతే అధిష్టానం ఈ విషయాన్ని తేలుస్తుందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన చర్చలు ఇంకా జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే! 

చదవండి: ‘స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు’

Advertisement
 
Advertisement
 
Advertisement