సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూటమి సర్కార్ టార్గెట్‌గా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీంతో, కొలికపూడి పోస్టు చర్చనీయాంశంగా మారింది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తాజాగా బెల్ట్ షాపుల నిర్వహణపై స్పందించారు. వైన్ షాపుల ఓనర్లు సిండికేట్‌గా ఏర్పడి బెల్టు షాపులు నడుపుతున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులకు ఎమ్మార్పీపై 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్‌పై అదనంగా 50 వసూలు చేస్తున్నారంటూ పోస్టులో తెలిపారు. లిక్కర్ సిండికేట్‌తో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలను ఎక్సైజ్ అధికారులు పాటించడం లేదు. గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించాలని మహిళలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ బెల్ట్ షాపుల దందా కొనసాగుతోందన్నారు. దీంతో, కొలికపూడి పోస్ట్ మరోమారు చర్చనీయాంశంగా మారింది.



