తిరుచిరాపల్లి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్‌ రాజీనామా | Tamil Nadu CM Vijay resigns from Tiruchurapalli East constituency | Sakshi
Sakshi News home page

తిరుచిరాపల్లి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్‌ రాజీనామా

May 10 2026 5:59 PM | Updated on May 10 2026 8:22 PM

Tamil Nadu CM Vijay resigns from Tiruchurapalli East constituency

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌ ఆదివారం తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్ కె.శ్రీనివాసన్‌ను మంత్రులు కేఏ సెంగొట్టైయన్, పి వెంకటరామణన్ కలిసి విజయ్‌కు సంబంధించిన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచారు. ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానంలో కొనసాగాలని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం పేర్కొంటోంది. దీంతో పెరంబూర్ నుంచి కొనసాగాలని విజయ్‌ నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు, విజయ్ తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్నైలోని చరిత్రాత్మక ఫోర్ట్ జార్జ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కొత్త ప్రారంభానికి, నిజమైన లౌకిక, సామాజిక న్యాయ యుగానికి నాంది అవుతుందని చెప్పారు. సినీ జీవితాన్ని వదిలి ప్రజల రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను రాజ కుటుంబం నుంచి రాలేదని తెలిపారు.

సీఎం విజయ్‌ సమీక్షా సమావేశం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు విజయ్ చెన్నైలోని సలై రోడ్డులో ఉన్న పెరియార్ స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్‌గా టీవీకే నాయకుడు ఎంవీ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్నారు. త్వరలోనే విజయ్‌ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement