నన్ను ఏ శక్తీ ఆపలేదు.. కేజ్రీవాల్‌కు ట్విస్ట్‌ ఇచ్చిన స్వాతి మలివాల్‌ | Sakshi
Sakshi News home page

నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు: ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌

Published Fri, May 24 2024 11:36 AM

Swati Maliwal Says Not Resign To Rajya Sabha MP Seat

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఏ శక్తి తనను అడ్డుకోలేదంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా, ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం బిభవ్‌ కుమార్‌పై ఆమె కేసు పెట్టారు. ఈ క్రమంలో బిభవ్ కుమార్‌కు కోర్టు ఇటీవలే ఐదు రోజుల కస్టడీ విధించింది. దీంతో బిభవ్‌ కుమార్‌ను పోలీసులు విచారిస్తు‍న్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్వాతి మలివాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘2006లో ఇంజినీరింగ్ జాబ్ వదులుకుని వీళ్లతో చేతులు కలిపాను. అప్పుడు మేము ఎవరమో ఎవరికీ తెలీదు. అప్పట్లో ముగ్గురం మాత్రమే ఉండేవాళ్లం. అప్పటి నుంచీ నేను పనిచేస్తూనే ఉన్నా. క్షేత్రస్థాయిలో కూడా పని చేశా. ఇన్నేళ్లల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించా. వాళ్లకు ఎంపీ సీటు కావాలంటే నన్ను మర్యాదపూర్వకంగా అడిగి ఉండాల్సింది. కానీ, నాపై దాడి చేయడమేంటి?. నన్ను తీవ్రంగా గాయపరిచారు.

 

 

నాపై దాడి జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్‌ అక్కడే ఉన్నారు. కనీసం అడ్డుకోలేదు. నేను రాజీనామా చేసి ఉండేదాన్ని. కావాలంటే నా ప్రాణాలైనా ఇచ్చేదాన్ని. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. మీరు నా కెరీర్‌ను పరిశీలిస్తే తెలుస్తుంది.. నేను ఏ రోజూ పదవుల కోసం ఆశపడలేదు. ఏ పదవీ లేకపోయినా నేను పని చేయగలను. ఇప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు. నేను రాజీనామా చేయను’ అంటూ తేల్చి చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement