నమ్మించి ముంచేశారు  | Sakshi
Sakshi News home page

నమ్మించి ముంచేశారు 

Published Fri, Mar 8 2024 5:16 AM

Stones pelted Jayachandra Reddy car in Tamballapally - Sakshi

ఆందోళన బాట పట్టిన టీడీపీ శ్రేణులు 

గుంతకల్లుల్లో గుమ్మనూరు వద్దంటూ ర్యాలీ  

తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డి కారుపై రాళ్లదాడి 

నిడదవోలులో దుర్గేశ్‌కు నిరసన సెగ 

పిఠాపురంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ లేఖలు దహనం  

కోవూరు తెరపైకి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 

సాక్షి, గుత్తి/పెద్దతిప్పసముద్రం/నిడదవోలు/పిఠాపురం/నెల్లూరు: నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్న చంద్రబాబు తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడుతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇంతవరకు పార్టీని అంటిపెట్టుకున్న తాము అంటరానివారైపోయామని ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నేతల అనుచరవర్గాలు దీన్ని జీర్ణించుకోలేక రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
 
గుమ్మనూరుకు సీటిస్తే ఓడిస్తాం 
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టీడీపీ టికెట్‌ ఇస్తే డిపాజిట్లు రాకుండా ఘోరంగా ఓడిస్తామని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే జితేందర్‌ గౌడ్‌ వర్గీయులు గుత్తిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి గాందీ, రాయల్, ఎన్టీఆర్‌ సర్కిళ్ల వరకు ర్యాలీ చేశారు. ‘గుమ్మనూరు వద్దు, జితేందర్‌ గౌడ్‌ ముద్దు’, ‘ఆలూరులో పనికి రాని చెత్త గుంతకల్లులో పనికి వస్తుందా’,

‘పేకాట, మద్యం గుమ్మనూరు మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సీనియర్‌ నాయకులు మాట్లాడుతూ... గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు ఎమ్మెల్యే సీటు ఇస్తే డిపాజిట్లు రాకుండా దారుణంగా ఓడిస్తామన్నారు. రౌడీ భావజాలమున్న గుమ్మనూరుకు సీటు ఇస్తే ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. 35 సంవత్సరాల పాటు జితేందర్‌ గౌడ్‌ కుటుంబం టీడీపీకి సేవలు చేసిందని, అలాంటి కుటుంబాన్ని పక్కన పెట్టి పేకాట నిర్వాహకుడు  గుమ్మనూరుకు ఎలా సీటు కేటాయిస్తారని ప్ర శ్నించారు.
 
టి.సదుంలో ఉద్రిక్తత 
అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని టీడీపీలో విభేధాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌కే అసెంబ్లీ టికెట్‌ దాదాపుగా ఖరారైందని అనుకుంటున్న సమయంలో రాజకీయ అరంగేట్రానికి తెర లేపిన జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో శంకర్‌ వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంపై పునరాలోచించి ప్రజాదరణ ఉన్న శంకర్‌కు టికె­ట్‌ కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు ఇటీవల రోడ్లెక్కి నిరసనలకు దిగారు.

తాజాగా గురువారం టి.సదుంలో జయ­చంద్రారెడ్డి ఇంటింటా ప్రచారానికి రావడంతో ఆగ్రహంతో ఉన్న ఓ వ్యక్తి జయచంద్రారెడ్డి కారు అద్దాలను పగులగొట్టాడు. దీంతో కొంతసేపు గ్రామంలో ఘర్షణ నెలకొంది. ఎస్‌ఐ రవీంద్రబాబు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి జయచంద్రారెడ్డి నిరాకరించారు. ఆయన వెంట ప్రచారం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆలయంలో పూజలు నిర్వహించి వెనుదిరిగారు.  

నిడదవోలులో ఆందోళన  
పొత్తులో భాగంగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్కు నిడదవోలు టికెట్‌ కేటాయిస్తున్నారనే ప్రచారంతో టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిడదవోలు పట్టణంలో ఆందోళన చేపట్టారు. నిడదవోలు పట్టణం, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు మద్దతుగా ప్లకార్డులతో పాదయాత్ర చేపట్టారు.

గణేష్‌ చౌక్‌ సెంటర్, గణపతి సెంటర్‌ మీదుగా యర్నగూడెం రోడ్డులోని టీడీపీ పట్టణ కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించారు. శేషారావు నాయకత్వం వర్థిల్లాలి, శేషారావు జిందాబాద్, నిడదవోలు గడ్డ – శేషారావు అడ్డా అంటూ నినదించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, నిడదవోలు టికెట్‌ శేషారావుకు కాకుండా బయటి వ్యక్తులకు ఎవరికిచ్చినా మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. టీడీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని సూచించారు.

టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాచమళ్ళ శ్రీనివాస్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కారింకి సాయిబాబు, పార్లమెంటరీ అధికార ప్రతినిధి బుగ్గే శివరామకృష్ణశాస్త్రి, కౌన్సిలర్‌ కారింకి నాగేశ్వరరావు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల టీడీపీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, సింహాద్రి రామకృష్ణ, అతికాల శ్రీను తదితరులు నాయకత్వం వహించారు.
 
పిఠాపురంలో అసమ్మతి సమావేశం 
చంద్రబాబుకే క్లారిటీ లేదు.. ఇంక మా భవిష్యత్తుకేం గ్యారెంటీ ఇస్తాడు’ అంటూ కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ వర్గాలు ఆందోళనకు దిగాయి. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ లేఖలను తగులబెట్టారు. తనకు టికెట్‌ నిరాకరించి, జనసేనకు కేటాయిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు సమాచారం అందడంతో.. టీడీపీ వర్గాలు గురువారం పిఠాపురంలో ఆందోళనకు దిగాయి.

ఇప్పటికే ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో వర్మకు టికెట్‌ నిరాకరించడంతో టీడీపీలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతామని హెచ్చరించారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలను సైతం పట్టుకునేది లేదని చెప్పారు.

రాజీనామాలకు సంతకాలు సేకరించారు. వర్మ మాట్లాడుతూ ‘నేనేమన్నా నేరం చేశానా? నా ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేశాను’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తాను చేసిన సేవను గుర్తించి చంద్రబాబు తనకే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. టీడీపీ కౌన్సిలర్‌ అల్లవరపు నగేష్‌ మాట్లాడుతూ, పిఠాపురం వర్మ అడ్డా అని, దానిని వేరేవారికి కేటాయించడానికి ఎవరికీ హక్కు లేదని వ్యాఖ్యానించారు.   

కోవూరులో పోలంరెడ్డి కుటుంబం కుతకుత 
కోవూరు టికెట్‌ విషయంలో రెండు దశాబ్దాల కాలంగా టీడీపీని నమ్ముకున్న పోలంరెడ్డి కుటుంబానికి చంద్రబాబు హ్యండిచ్చారు. ఇటీవలే పార్టీ ఫిరాయించిన వేమిరెడ్డి కుటుంబానికి కోవూరు సీటు ఖరారు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో పోలంరెడ్డి వర్గం మండిపడుతోంది. నిన్నటి వరకు సీటు తనదేనంటూ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి పార్టీ వ్యవహారాల్లో మునిగితేలారు. ఇటీవల పార్టీ అధినేత పర్యటనల సమయంలో చేతిచమురు కూడా వదిలించుకుంటున్నారు.

ఈ తరుణంలో చంద్రబాబు కోవూరు సీటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఖరారు చేస్తున్నట్లు లీకులిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోవూరు టీడీపీలో కీలకనేతగా ఉన్నారు. మూడు సార్లు టీడీపీ తరుపున పోటీచేసి రెండుసార్లు విజయం సాధించారు. పోలంరెడ్డికి అనారోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం తన రాజకీయ వారసుడిగా తనయుడు దినేష్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధిష్టానం కూడా దినేష్ రెడ్డిని ప్రోత్సహించింది.

ఈ క్రమంలో సీటు విషయంలో చంద్రబాబు పేచీ పెట్టడంతో దినేష్ రెడ్డి రాజకీయ జీవితం సందిగ్థంలో పడింది. ఆత్మ గౌరవం దెబ్బతిన్నదంటూ పార్టీ ఫిరాయించిన ఎంపీ వేమిరెడ్డి భార్యకు కోవూరు సీటు ఖరారు చేస్తుండడంపై పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి అందలం ఎక్కించడం వెనుక కేవలం డబ్బుమూటలే పనిచేస్తున్నాయని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement