ప్రజలకు కష్టాలు.. ప్రభుత్వానికి లాభాలు!

Sonia Gandhi writes to PM, Demands Rollback of High Fuel Prices - Sakshi

కేంద్రం తీరుపై కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ధ్వజం

ఇంధన ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి లేఖ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచి కష్టాల్లో ఉన్న ప్రజల నుంచి లాభాలు దండుకుంటోందని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ మండిపడ్డారు. రాజధర్మాన్ని పాటించి తాత్కాలికంగా ఇంధనంపై ఎక్సైజ్‌ డ్యూటీని వెనక్కి తీసుకోవడం ద్వారా ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘పెరుగుతున్న ఇంధన, గ్యాస్‌ ధరలతో ప్రతి పౌరుడు పడుతున్న ఇబ్బందులను మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను. దేశంలో ఒక వైపు ఉద్యోగాలు, వేతనాలు, గృహ ఆదాయాలు క్రమక్రమంగా కోల్పోతున్న పరిస్థితి ఉంది. మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాల జీవనం కష్టతరంగా మారింది. వీటికి తోడు నిత్యావసరాలు సహా అన్ని వస్తువుల ధరల ఆకాశాన్నంటుతున్నాయి.

మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు పెరుగుతూ పోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి ప్రభుత్వం లాభాలు గుంజుతోంది’అని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్‌ ధర రూ.100కు చేరుకుందనీ, డీజిల్‌ ధరలు కూడా అదే స్థాయిలో పైకి పాకుతుండటంతో కోట్లాది మంది రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంధన ధరల పెరుగుదలకు గత ప్రభుత్వాలదే బాధ్యతంటూ మాట్లాడటం శోచనీయమన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎన్నికైన ప్రభుత్వాలు, అందుకు విరుద్ధంగా పనిచేయడం తగదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top