మహిళా ఎమ్మెల్యేపై మాజీ సీఎం అనుచిత వ్యాఖ్యలు

Shivraj Singh Chauhan Starts Maun Vrat Over Kamalnath Item Remark - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ రాష్ట్ర మంత్రి ఇమర్తి దేవిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం రెండు గంటలపాటు మౌనవ్రత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చౌహాన్‌ మాట్లాడుతూ.. ‘మాజీ సీఎం వ్యాఖ్యలు ఆయన వంకర బుద్ధిని, నీచ మనస్తత్వాన్ని చూపిస్తున్నాయి. కమల్‌ నాథ్‌ వ్యాఖ్యలు కేవలం ఇమర్తి దేవికి మాత్రమే కాదు గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలోని ప్రతి మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’ అంటూ ఆదివారం ట్వీట్‌ చేశారు. ఇంతకు వివాదం ఏంటంటే ఆదివారం గ్వాలియర్‌ దాబ్రా పట్టణంలో నిర్వహించిన ఎన్నికల‌ సమావేశంలో మాజీ సీఎం కమల్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన తమ ప్రత్యర్థి ఇమర్తి దేవిని ఉద్దేశిస్తూ ‘ఐటం’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

‘మా పార్టీ తరఫున బరిలో ఓ సాధారణ వ్యక్తి నిలచారు.. కానీ అవతలి క్యాండెట్‌ ఓ ఐటం’ అంటూ కమల్‌నాథ్‌ తన నోటి దురుసును ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌహాన్‌, కమల్‌ నాథ్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ‘మీ ప్రకటనతో కాంగ్రెస్‌ పార్టీ వక్ర బుద్ధి, నీచ మనస్తత్వం మరోసారి తెర మీదకు వచ్చింది. మీరు అవమానించింది ఇమర్తి దేవిని మాత్రమే కాదు.. గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలోని ప్రతి సోదరిని. మహిళలతో గౌరవంతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు కమల్‌ నాథ్‌ జీ’ అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. దీనిపై ఆదివారం బీజేపీ ప్రతినిధి బృందం భోపాల్‌లో ఎన్నికల సంఘం అధికారులను కలుసుకుని నాథ్‌పై "మహిళలు, దళితులను అవమానించారని" ఫిర్యాదు చేశారు. (చదవండి: దళిత మహిళపై దాడి.. వీడియో షేర్‌ చేసిన మాజీ సీఎం)

జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలైన ఇమార్తి దేవి, మరో 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేసి, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. మార్చిలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top