విజయం అందించిన  ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు: సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments On ZPTC MPTC Elections Won - Sakshi

సాక్షి, అమరావతి: పరిషత్‌ ఎన్నికల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలకు పార్టీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పరిషత్‌ ఎన్నికల విజయంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన స్పందించారు.

‘సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఆశీస్సులు ఇచ్చారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన నిమ్మగడ్డ, కోర్టులకు వెళ్లి ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకి కూడా కృతజ్ఞతలు. ఏ రాజకీయ పార్టీ వ్యవహరించని రీతిలో టీడీపీ డాంభికాన్ని ప్రదర్శిస్తోంది. అచ్చెన్న దమ్ముంటే ఎన్నికలు పెట్టండి.. అంటున్నాడు.. 2019లో బొక్కబోర్లా పడ్డా బుద్ధి రాలేదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలనే పరిస్థితి కూడా లేదు. జగన్‌మోహన్ రెడ్డి పదేళ్లుగా పరిశీలించి ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో కొత్త ప్రయోగం చేస్తున్నారు.

బడుగుల జీవితాల్లో వెలుగు నింపడానికి చేస్తున్న కృషికి ప్రజలు శభాష్ అని తీర్పు ఇచ్చారు. విశ్వసనీయత నచ్చితే ప్రజలు ఎలా అక్కున చేర్చుకుంటారో స్పష్టంగా కనిపించింది. కొన్ని పార్టీలు గుణపాఠాలు నేర్చుకోవడానికి కూడా ఈ ఫలితాలు ఉపయోగపడతాయి. నిజమైన సమానత్వం ఇవ్వగలిగితే... అన్ని రకాల పేదరికాన్ని పారద్రోలగలిగితే ఫలితాలు ఎలా ఉంటాయో కనిపించాయి’ అని సజ్జల తెలిపారు.

‘2020లో మొదలైన ఈ ప్రక్రియ 2021 సెప్టెంబర్ 19వ తేదీన ముగియడం వారి పుణ్యమే. 2018లో జరగాల్సిన ఎన్నికలు ఇవి జనం ఛీ కొడతారని చంద్రబాబు ఎన్నికలు పెట్టలేదు. 2014లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలకు మేము చంద్రబాబులా భయపడలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలై ప్రజల్లో స్పందన చూసి వాళ్లకి దిక్కు తెలియలేదు. అభ్యర్థుల భవిష్యత్తును వీరి దుర్మార్గపు కుట్రల వల్ల ఇబ్బంది పెట్టారు. మీరు పదిసార్లు వాయిదా వేసినా మళ్లీ మేమే వస్తామని ఆనాడే చెప్పాం. ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలో తెలుసుకోకుండా కుట్రలపై కుట్రలు చేశారు’ అని సజ్జల మండిపడ్డారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top