
సాక్షి, తిరుపతి: లోకేశ్ పిల్లిబిత్రిగాడు అని మంత్రి ఆర్‌కే రోజా ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ లోకేశ్ పాదయాత్రకు జనాలు రావడానికే భయపడుతున్నారని, యువత పారిపోతున్నారని చెప్పారు. పాదయాత్రలో పది మంది నాయకులు లేరు.. అది ఫెయిల్యూర్ యాత్ర అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నందమూరి కుటుంబం గుర్తుకురాలేదని, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వారు గుర్తుకొస్తారని విమర్శించారు.
చంద్రబాబు, లోకేశ్‌లు టీడీపీని లాక్కున్న దొంగలని, ఆ పార్టీ పెట్టిన వ్యక్తి మనవడిని లోకేశ్ ఆహ్వానించడం దారుణమన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ వల్ల ఉపయోగం లేదనే జూనియర్ ఎన్టీఆర్‌ను పిలుస్తున్నారని విమర్శించారు. టీడీపీతో ఉండాలని పవన్‌కళ్యాణ్‌ను ఆంధ్రజ్యోతి ద్వారా బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఏస్‌కు వెయ్యి కోట్లకు అమ్ముడు పోయే నేత అని రాస్తున్నా.. పవన్ ఎందుకు స్పందించడం లేదని, చెప్పు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. నాడు పీఆర్పీని ఆకాశానికి ఎత్తి, ఆపై విషపు రాతలు రాసినట్టుగానే.. జన సేన విషయంలోనూ చేస్తున్నారని మంత్రి ఆర్‌కే రోజా వివరించారు. చంద్రబాబు, లోకేశ్‌లకు దమ్ముంటే చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు.