సోనియా ఇవ్వకపోతే..వందేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదు | Sakshi
Sakshi News home page

సోనియా ఇవ్వకపోతే..వందేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదు

Published Sat, May 7 2022 1:53 AM

Revanth Reddy Fires on Kcr in Warangal Meeting - Sakshi

(వరంగల్‌ నుంచి ‘సాక్షి’ప్రతినిధి): తెలంగాణ ఏర్పాటైన ఎనిమిదేళ్లలో ఎవరికీ మేలు జరగలేదని.. కన్నీళ్లు, కష్టాలు, చావులు, ఆత్మహత్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడారు. ‘‘సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇంకో వందేళ్లయినా తెలం గాణ వచ్చేది కాదు. 4 కోట్ల మంది ప్రజల కోసం ఇచ్చిన తెలంగాణ.. ఇప్పుడు నలుగురి చేతిలో బందీ అయింది. నిజాం నవాబు శ్రీమంతుడు కావడానికి 200 ఏళ్లు పడితే కేసీఆర్‌ కుటుంబానికి ఎనిమిదేళ్లు కూడా పట్టలేదు. గ్రామాల్లోకి వెళితే ‘కేసీఆర్‌ పాలన వద్దురా రామచంద్రా..’ అని ప్రజలు రోదిస్తున్నారు.

ఎవరైనా వచ్చి కేసీఆర్‌ను గద్దె దింపాలని కోరుకుంటున్నారు. కేసీఆర్‌ ఒక తరాన్ని దోచుకున్నాడు. ఆయన్ను గద్దె దిం పేందుకు ప్రజలు సిద్ధం కావాలి’’ అని పిలుపునిచ్చారు. అంతకుముందు రేవంత్‌ రైతు డిక్లరేష న్‌ను ప్రకటిస్తూ.. తెలంగాణ తమకు నినాదం, ముడి సరుకు, ఓట్లు రాల్చే ఉన్మాదమో కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే తమకు పేగు బంధం, ఆత్మగౌరవమని చెప్పారు. కేసీఆర్‌ వంచనకు గురై.. కల్లాల్లో వరి కుప్పలపై గుండె పగిలి చనిపోతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకే రాహుల్‌గాంధీ సమక్షంలో, సాయుధ పోరాట స్ఫూర్తితో ‘రైతు డిక్లరేషన్‌’ను ప్రకటిస్తున్నామని చెప్పారు. రైతును రాజు చేయడమే తమ లక్ష్యమని, అది రాహుల్‌తోనే సాధ్యమన్నారు. 

Advertisement
Advertisement