ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్!

రాజకీయ పార్టీల్లో లుకలుకలు సహజమే. కాని ఎంతో క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే కాషాయ పార్టీలో ఈ మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. విభేదాలు అని తెలియకుండానే నాయకులు మాటల ఈటెలు విసురుకుంటున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు బయటపడింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీకి కొత్త నేత. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై కాషాయతీర్థం పుచ్చుకుని ఉప ఎన్నికలో విజయం సాధించి బీజేపీకి కొండంత ధైర్యాన్నిచ్చారు. కాని అదే జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఆయనకు పొసగడంలేదనే వార్తలు అప్పుడప్పుడు బయటకొస్తున్నాయి.
కాని ఇంతవరకు వారిద్దరి మాటల్లో విభేదాల గురించి ఏనాడూ ప్రస్తావన రాలేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో కీలకనేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించడానికి పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ వెళ్ళారు. ఇదే విషయాన్ని కరీంనగర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్‌ను విలేకర్లు అడిగారు. ఈటల వెళ్ళిన సమాచారం తనకు లేదంటూనే..అయినా తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదని కవరింగ్ చేశారు బండి సంజయ్.
పార్టీలో ఒక జిల్లాలోని కీలక నేత చేరిక విషయమై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా జరుగుతుందంటే ఎవరూ నమ్మరు. ఇప్పుడు బండి సంజయ్ చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే. సహజంగా కొంత వెటకారం, మరికొంత హాస్యం జోడించి మాట్లాడే బండి సంజయ్.. తన ఫోన్ పోయిందని.. పోలీసులు తీసుకున్నారని చెబుతూ...అందుకే ఈటల వెళ్ళిన సమాచారం తనకు చేరవేయడం సాధ్యం కాకపోయిండొచ్చని కామెంట్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నాయకుడు తమ పార్టీలోకి వస్తామంటే తప్పకుండా స్వాగతిస్తామని చెప్పారు. చేరికల విషయంలో తనకు తెలిసినవారితో తాను, ఈటలకు పరిచయమున్నవారితో ఈటల మాట్లాడుతామని..తమ మధ్య విభేదాలేమీ లేవని ప్రకటించారు. విషయం తెలియదంటూనే సెటైరిక్‌గా ముక్తాయింపిచ్చారు బండి సంజయ్.
ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చినప్పటినుంచే ఈ ఇద్దరు నేతల మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. మధ్యలో కొంతకాలం కలిసున్నట్టే కనిపించినా.. ఈటలకూ పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యం.. ఇద్దరు నేతలు బీసీ వర్గాలకే చెందినవారు కావడం..ఈటలకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం వంటి కారణాలు ఇద్దరి మధ్యా గ్యాప్ పెంచినట్లు సమాచారం. తనకు పోటీగా వస్తున్నవారిని బండి కొంత దూరంగా పెడుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో బండి మాట్లాడిన మాటలను ఖండించడం.. మరోవైపు రఘునందన్రావుతోనూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. తాజాగా ఈటల, పొంగులేటి భేటీపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. ముమ్మాటికీ ఆ పార్టీ అంతర్గత విభేదాలే అంటూ జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.
కరీంనగర్ ఎంపీగా గెలిచి.. తెలంగాణా రాష్ట్రంలో కనివినీ ఎరుగని రీతిలో.. గతంలో ఏ అధ్యక్షుడి సమయంలోనూ రాని క్రేజునైతే బండి సంజయ్ బీజేపీకి తెచ్చిపెట్టారన్నది పార్టీలో అందరూ అంగీకరించే విషయమే. నాయకులంతా కలిసి మెలిసి పార్టీని అభివృధ్ధి చేయాలని హైకమాండ్ సూచించినప్పటికీ... కొద్దికాలం తర్వాత మళ్ళీ యథాప్రకారమే నడుచుకుంటున్నారు. తాజా పరిణామాలతో ఇద్దరి మధ్యా ఉన్న విభేదాల గురించి మరోసారి అటు కేడర్‌కు..ఇటు జనానికి తెలిసింది. కీలక నేతలు ఇలా వ్యవహరిస్తే పార్టీకే నష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.