
సాక్షి,తాడేపల్లి: పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారంటూ’ చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్న చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు పొడవడం.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారు?. హత్యకు గురైన వారు, చేసినవారు టీడీపీ వారేనని స్వయంగా ఎస్పీ చెప్పారు. గ్రామంలోని రెండు టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్యపోరులోనే హత్యలు జరిగాయని ఎస్పీ చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్‌లో వైసీపి నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారు. హత్య కేసులోని ముద్దాయిల్లో ఒక్కరైనా వైఎస్సార్‌సీపీ జెండా పట్టుకున్నారా?. ఏనాడైనా ఫ్యాను గుర్తుకు ఓటేశారా?. ముద్దాయి కొత్త కారు కొంటే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దాన్ని ప్రారంభించారు. అదే కారులో వెళ్ళి చంద్రబాబును కలిశారు. అలాంటి వ్యక్తి వైఎస్సార్‌సీపీ అని ఎలా చెప్తారు?.
అంతులేని పాపాలను మూట కట్టుకుంటున్నారు. శిశుపాలుడులాగా పాపాలు చేస్తూ పోతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు. అదే వెన్నుపోటు త్వరలోనే లోకేష్.. చంద్రబాబును పొడుస్తాడు. పార్టీనీ, సీఎం కుర్చీని లాక్కోబోతున్నారు. చంద్రబాబు అక్కచెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?. ఏనాడైనా వారు చంద్రబాబు ఇంటి గడప తొక్కారా?. హైదరాబాద్, కుప్పం, అమరావతిలో వందల కోట్లతో ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే అక్కచెల్లెళ్ళు ఎవరైనా వచ్చారా?. రాజమహల్, జైపూర్ ప్యాలెస్ లాంటి ఇళ్లు కట్టుకుని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు?. కొత్త ఇంట్లో పాలు పొంగించేది ఇంటి ఆడపిల్లలే. మరి ఏనాడైనా ఆ ఆడపిల్లలు చంద్రబాబు ఇంటికి ఎందుకు రావటం లేదు?. నారా లోకేష్ తన తాత ఖర్జూరనాయుడు అని ఎందుకు చెప్పుకోలేక పోతున్నారు?. ఇలాంటివేమీ మేము అడగ దలచుకోలేదు.

రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే విచారణ ఉండదు. పిఠాపురంలో దళితులను వెలేస్తే విచారణ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని దియేటర్లపై విచారణ చేస్తున్నారు. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ నిర్ణయం తీసుకుంటే ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ విషయం తెలీదు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఆ విషయం తెలియదు
రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ ఏం పని చేస్తోంది?. పోలీసులందరినీ వైఎస్సార్‌సీపీ నేతలను వేధించటానికి మాత్రమే ప్రభుత్వం వాడుకుంటోంది. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులను వాడటం లేదు. అందుకే చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సినిమాల విషయంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మా నిర్ణయాలు తప్పయితే ఈ సంవత్సరకాలంగా ఎందుకు అమలు చేస్తున్నారు?.పవన్ సినిమా వచ్చే ముందు ధియేటర్లలో విచారణ చేయటానికి సిగ్గు లేదా?’ అని వ్యాఖ్యానించారు.