యూపీఏ చైర్మన్‌గిరీపై ఆసక్తి లేదు

not interested in becoming UPA chairperson or leading anti-BJP front - Sakshi

బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ నుంచి కాంగ్రెస్‌ను విడదీయలేం: పవార్‌

పుణె: బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించబోనని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. యూపీఏ కూటమికి చైర్మన్‌గా ఉండాలన్న ఆసక్తి కూడా తనకు లేదని ఆదివారం మీడియాతో అన్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిర్మించే ఏ వేదికలోనైనా కాంగ్రెస్‌ను దూరంగా ఉంచలేమన్నారు. ‘‘బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తా. ఇప్పుడూ అదే ప్రయత్నాల్లో ఉన్నా. కూటమి కట్టాలంటే విపక్షాలు కొన్నింటిని మర్చిపోవాలి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పశ్చిమబెంగాల్‌లో బలమైన పార్టీ. ఇతర ప్రాంతీయ పార్టీలూ తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామంలోనూ ఆ పార్టీకి కార్యకర్తలున్నారన్నది వాస్తవం.

అందుకే బీజేపీ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కాంగ్రెస్‌ను కలుపుకుని పోవడం తప్పనిసరి. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం నెలకొనాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఒక్క పార్టీయే ఉంటే రష్యాలో పుతిన్‌ నాయకత్వంలా ఉంటుంది’’ అన్నారు. హిందువులే గాక ఇతర మతస్తులు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యేలా కశ్మీరీ ఫైల్స్‌ సినిమాను చిత్రీకరించారని విమర్శించారు. ‘‘పాక్‌ అనుకూల వర్గం అప్పట్లో కశ్మీర్‌ లోయలో హిందువులతోపాటు ముస్లింలపైనా అరాచకాలకు పాల్పడింది. కాపాడాల్సిన నాటి ప్రభుత్వం హిందువులను రాష్ట్రం వదిలి పొమ్మంది’’ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడిపైనే గాక నిత్యావసరాల ధరలు, రవాణా ఖర్చులపైనా పడుతోందని పవార్‌ విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top