Nagarjuna Sagar Bypoll: గులాబీ ‘సాగర’ వ్యూహం

Nagarjuna Sagar Bypoll 2021: TRS Party Strategy for Win, KCR Meeting - Sakshi

ఏప్రిల్‌ 14న కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు

2 రోజులపాటు మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోలు ఉండేలా కార్యాచరణ

నియోజకవర్గంలోనే ఉండాలని మంత్రి తలసానికి పార్టీ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, నామినేషన్‌ దాఖలు కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార టీఆర్‌ఎస్‌ ఇక ‘ఆపరేషన్‌ నాగార్జున సాగర్‌’ ప్రారంభించింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించడమే లక్ష్యంగా గులాబీదళం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ప్రచారం ముగియడానికి ముందురోజు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 14న బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపాయి. అదేవిధంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ కూడా రెండ్రోజులపాటు రోడ్‌ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే రోడ్‌ షోలు ఎక్కడెక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్నది ఖరారు కానుంది. 

ఇక భగత్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించింది. సోమవారం రాత్రే హాలియా చేరుకున్న తలసాని... స్థానిక నేతలతో చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల ఫోన్‌ చేయడంతో సాగర్‌ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న గురవయ్య యాదవ్, రంజిత్‌ యాదవ్, శ్రీనివాస్‌ యాదవ్‌లను బుజ్జగించారు. భగత్‌కు టికెట్‌ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని వారికి వివరించారు. రెండ్రోజుల్లో వారిని కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లి భరోసా ఇప్పించే ప్రయత్నాల్లో తలసాని ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గంలో పర్యటించాలని, భగత్‌ గెలుపు కోసం పనిచేయాలని తెలంగాణ భవన్‌ ఆదేశాలు జారీ చేసింది.

ఇక్కడ చదవండి:
మంత్రిగా పనిచేశాడు.. సొంత వాహనం కూడా లేదు!

సాగర్‌ ఉప ఎన్నిక.. చివరి రోజు నామినేషన్‌లు వేసిందేవరంటే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top