మిత్రులకు దోచిపెట్టే పనిలో మోదీ

Monetisation Will Rob Quota Assets Will Go To A Few: Mallikarjun Kharge - Sakshi

మల్లికార్జున ఖర్గే ధ్వజం 

ప్రజా సంపదను కాంగ్రెస్‌ కాపాడితే బీజేపీ తెగనమ్మేస్తోంది 

రిజర్వేషన్లు ఎత్తివేసేందుకే పీఎస్‌యూలను అమ్ముతున్నారు 

ఇదే కొనసాగితే పేదలు మరింత పేదలుగా మారిపోతారు 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ లూటీ చేయడంలో భాగంగా వాటిని అమ్మేసి తన మిత్రులకు దోచిపెట్టడమే ప్రధాని మోదీ పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. రూ.6 లక్షల కోట్ల నిధుల సమీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం జాతి సంపదను తెగనమ్మేస్తోందని ధ్వజమెత్తారు.

ఒకరోజు హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు గీతారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ, మల్లురవి, దాసోజు శ్రావణ్, పొన్నం ప్రభాకర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

అచ్ఛేదిన్‌ అంటే జాతి సంపదను అమ్మడమా! 
దేశానికి అచ్ఛేదిన్‌ రాబోతున్నాయని మోదీ చెబుతూంటారని, జాతి సంపదను అమ్మివేయడమే అచ్ఛేదిన్‌ రావడమా అని ఖర్గే ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రపంచ దేశా లకు ధీటుగా మెరుగుపర్చడమే లక్ష్యంగా నాడు నెహ్రూ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువచ్చారన్నారు.

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కోసం పబ్లిక్, ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహించారని చెప్పారు. కానీ మోదీ ప్రభు త్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగం కుప్పకూలితే రిజర్వేషన్లు పూర్తిగా పోతాయని, ఈ విధంగా రిజర్వేషన్లను ఎత్తివేసేందుకే మోదీ ప్రభుత్వం పరోక్షంగా పనిచేస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలోని పేదలు మరింత పేదలుగా మారిపోతారని చెప్పారు. 

సంపత్‌ ఇంట్లో అల్పాహారం 
ఖర్గేకు శంషాబాద్‌ విమానాశ్రయంలో రేవంత్‌రెడ్డితో పాటు నేతలు సంపత్‌కుమార్, మల్లురవి, హర్కర వేణుగోపాల్‌ స్వాగతం పలికారు. సంపత్‌ నివాసంలో ఖర్గే అల్పాహారం చేశారు. పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి, మరికొందరు ఖర్గేను కలిశారు. గీతారెడ్డి, అద్దంకి దయాకర్‌లతో పాటు ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్‌ ఖర్గేను కలిసి రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, సీఎం కేసీఆర్‌ ఆ వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top