
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సనత్‌నగర్: బీజేపీకి గల్లీగల్లీలో బలమైన నాయకత్వం ఉందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బేగంపేట, భగవంతాపూర్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీ, బ్రాహ్మణవాడీ బస్తీలతో పాటు బేగంపేట ఆర్యసమాజ్ భవన్ ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీకి ఓటు వేయాలని దేశమంతా నిర్ణయించుకుందన్నారు.
మోదీ మూడోసారి ప్రధాని అవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవేత్తలు కరెంట్ కోసం ధర్నాలు చేసేవారని, 6 గంటల కంటే ఎక్కువగా కరెంట్ వాడితే పరిశ్రమలు మూసివేస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే మోదీ వచ్చాక విద్యుత్ కోతలు లేని దేశం ఆవిష్కృతమైందన్నారు. గత పదేళ్లుగా దేశంలో మత కలహాలు, బాంబు పేలుళ్లు, కర్ఫ్యూలు లేవన్నారు. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. బేగంపేట, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లతో పాటు చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మోదీ పాలనతో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో బేరీజు వేయాలన్నారు.