దీదీ ఉక్కిరి బిక్కిరి.. బీజేపీలోకి 75 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు?! | Mamata holds massive dharna, only 8 MLAs, 6 MPs attend | Sakshi
Sakshi News home page

దీదీ ఉక్కిరి బిక్కిరి.. బీజేపీలోకి 75 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు?!

Jun 2 2026 9:35 PM | Updated on Jun 2 2026 9:37 PM

Mamata holds massive dharna, only 8 MLAs, 6 MPs attend

కోల్‌కతా: 15ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన మాజీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు, అలాగే తాను స్థాపించిన పార్టీ చేజారిపోతుందేమోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 80 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ 80 మంది ఎమ్మెల్యేలలో 70 మందికి పైగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా సెంట్రల్ కోల్‌కతాలో మమతా చేపట్టిన నిరసన కార్యక్రమం వేదికైంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు, కేసులు, ఇతర అంశాలపై మమతా బెనర్జీ మంగళవారం ఆందోళన చేపట్టారు. కానీ ఆ నిరసనకు 80 మంది ఎమ్మెల్యేలలో 75 మంది గైర్హాజరయ్యారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు.

ఎస్ప్లనేడ్‌లో జరిగిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలలో శోవన్‌దేబ్ చటోపాధ్యాయ్, నైనా బందోపాధ్యాయ్, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అసిమా పాత్రా ఉన్నారు. మమతా పక్కన కనిపించిన ఎంపీలలో డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్ ఉన్నారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

మరోవైపు మహారాష్ట్ర శివసేన తరహాలో టీఎంసీ కూడా రెండుగా చీలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో చేరకపోయినా, పార్టీ గుర్తును మమతా బెనర్జీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో బహిష్కృత నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

శోభన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదిస్తూ రాసిన లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు మమతా బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది గైర్హాజరయ్యారు.

అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన దాడి తర్వాత కూడా చాలా మంది టీఎంసీ నాయకులు బహిరంగంగా స్పందించలేదు. ఇప్పటికే 100 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీని వీడగా, పలువురు నాయకులు ముఖ్యంగా అభిషేక్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేయడం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఈ వరుస పరిణామాలతో టీఎంసీ భవిష్యత్తు అంధకారమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement