Mamata Banerjee: కంటతడిపెట్టిన దీదీ.. కారణమిదే

Mamata Banerjee Tears Into UPSC For Question On Bengal Poll Violence - Sakshi

యూపీఎస్సీ పరీక్షలో బెంగాల్‌ ఎన్నికల హింసపై ప్రశ్న

రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అంటూ దీదీ ఆవేదన

కోల్‌కతా: కేంద్రప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. సెంట్రల్ పోలీస్ ఫోర్స్‌ సేవల కోసం పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ).. తాను నిర్వహించే పరీక్షల్లో బీజేపీ అడగమన్న ప్రశ్నలే అడుగుతోందని.. ఈ చర్యలు దాని పునాదిని బలహీనపరుస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 

ఆ వివరాలు.. సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లో సివిల్, సాయుధ పోలీసుల ఉద్యోగాల కోసం నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల హింసపై ప్రశ్న అడిగారు. ఈ అంశంపై స్పందిస్తూ.. మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు బీజేపీ తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ దీదీ కంటతడిపెట్టారు. బీజేపీ అడగమన్న ప్రశ్నలనే యూపీఎస్సీ అడుగుతున్నదని మండిపడ్డారు.

‘‘బీజేపీ చెప్పిన ప్రశ్నలనే యూపీఎస్సీ అడుగుతుంది. యూపీఎస్సీ నిష్పక్షపాతంగా ఉండేది, కానీ ప్రస్తుతం బీజేపీ తాను అడగాలనుకున్న ప్రశ్నలను యూపీఎస్సీ బోర్డు చేత అడిగిస్తుంది. అలానే యూపీఎస్సీ పేపర్‌లో రైతుల నిరసనపై ప్రశ్న కూడా రాజకీయ ప్రేరేపితమే' అని మమతా బెనర్జీ విమర్శించారు. యూపీఎస్సీ వంటి సంస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు. బెంగాల్‌లో కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చేలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యకం చేసింది. మమతా బెనర్జీ కావాలనే తమ పార్టీ కార్యకర్తలను టార్గెట్‌ చేసి.. వారిపై దాడి చేయించారని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. చిన్న గొడవలను బీజేపీ పెద్దదిగా చేసి చూపుతోందని.. ఫేక్‌ వీడియోలు, ఫోటోలతో జనాలను మోసం చేస్తుందని మండిపడింది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top