సభాపతి పైకి పేపర్లు

LS sees repeated adjournments amid Oppn protests over Pegasus, farm laws - Sakshi

లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుల అనూహ్య చర్య

పెగసస్, రైతు చట్టాలపై చర్చకు విపక్షాల పట్టు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బుధవారం ఎలాంటి చర్చలు లేకుండా గురువారానికి వాయిదా పడింది. ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు సభాకార్యక్రమాలు జరగకుండా ఆందోళన కొనసాగించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్‌స్థానంపైకి విసరడం కలకలం సృష్టించింది. రెండు సభలు పలుమార్లు వాయిదా పడినా విపక్షాల నిరసన ఆగకపోవడంతో సభాధిపతులు మరుసటిరోజుకు సభలను వాయిదా వేశారు. పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుపడుతూ విపక్ష సభ్యులు సమావేశాలు జరగకుండా ఆందోళన జరుపుతున్న సంగతి తెలిసిందే!

బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్‌ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. కానీ వెంటనే విపక్షాలు తమ ఆందోళనను ఆరంభించాయి. పలువురు సభ్యులు సభ వెల్‌లోకి చేరుకొని నినాదాలతో సభను అడ్డుకున్నారు. కానీ స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన హౌస్‌ప్రొసీజర్స్‌ పుస్తకాన్ని రిఫర్‌ చేస్తూ కనిపించారు. ఎట్టకేలకు వర్షాకాల సమావేశాలు ఆరంభమైన తర్వాత తొలిసారి లోక్‌సభలో క్వశ్చన్‌ అవర్‌ జరిగినట్లయింది.

అనంతరం స్పీకర్‌ సభను వదిలివెళ్లగా డిçప్యూటీ స్పీకర్‌ రాజేంద్ర అగర్వాల్‌ సభా నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఈ సమయంలో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కొందరు కాంగ్రెస్‌ సభ్యులు పేపర్లు, ప్లకార్డులు చింపి లోక్‌సభ స్పీకర్‌స్థానం పైకి విసిరేశారు. కాంగ్రెస్‌కు చెందిన గుర్జీత్‌ ఔజాలా, ప్రతాపన్, హిబి ఈడెన్‌ తదితరులు పేపర్లు చింపి స్పీకర్‌ స్థానం మీదకు, ట్రెజరీ బెంచ్‌ల మీదకు విసిరారు. సాయంకాలానికీ సభలో నిరసనలు ఆగకపోవడంతో గురువారానికి సభను వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.  

రాజ్యసభలో కొనసాగిన నిరసనలు
పెగసస్, రైతు చట్టాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన రాజ్యసభలో బుధవారం కొనసాగింది. అయితే ఆందోళనల నడుమ సభ జువెనైల్‌ జస్టిస్‌ సవరణ చట్టం 2021కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. బుధవారం రాజ్యసభ సభాధిపతి వెంకయ్య జీరోఅవర్‌ను ఆరంభించారు. కాంగ్రెస్, టీఎంసీ, ఇతర విపక్ష సభ్యులు నినదిస్తూ సభను అడ్డుకున్నారు. కొందరు ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా వెంకయ్య అడ్డుకున్నారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే వెంకయ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. కానీ విపక్ష సభ్యులు స్లోగన్లు ఉధృతం చేసి సభను అడ్డుకున్నారు. ఈ సమయంలో సభ్యులు ముందే అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. అనంతరం తిరిగి సభ వాయిదా పడింది.  

అదనపు వ్యయానికి సభామోదం
ప్రభుత్వం అదనంగా రూ.23వేల కోట్ల వ్యయం చేసుకునేందుకు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 17వేల కోట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖకు కేటాయించారు. దీన్ని కోవిడ్‌ సంబంధిత వ్యయాలకు ఉపయోగిస్తారు. రూ. 2050 కోట్లు పౌరవిమానయాన శాఖకు వెళ్తాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top