నమ్మించి.. నట్టేట ముంచి.!!

Local TDP Leaders Angry Over MLA Gadde Rammohan Rao - Sakshi

గద్దెపై గుస్సా

మన గతేంటంటూ పోటీదారుల అంతర్గత భేటీలు

సిట్టింగ్‌ బీసీ, మైనార్టీలను పక్కన పెట్టారు

ఆర్థిక సాయం చేస్తామంటూ పోటీకి దింపి చేతులెత్తేశారు!

కన్నెర్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ తూర్పు శ్రేణులు 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ తూర్పు నియోజకవర్గం కంచుకోట... ఇది నిన్నటి వరకు టీడీపీ మాట. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ అంచనాలు పటాపంచలయ్యాయి. 21 నెలల కిందట జరిగిన సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ తల్లకిందులైంది. పూర్తిగా తిరగబడటంతో అన్ని స్థాయిల నాయకులకు కళ్లు బైర్లుకమ్మాయి. ఇదంతా ఒక ఎత్తయితే స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్‌ తమను నమ్మించి మోసం చేశారని పోటీదారులు పలువురు వాపోతున్నారు. తాము పోటీ చేయలేమని, ఆర్థికంగా తమ పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పినా వినిపించుకోకుండా అన్నివిధాలా తాము సర్దుబాటు చేసేస్తామని చెప్పి పోటీలోకి దింపి ఆఖరుకు చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

గద్దె రామ్మోహన్‌ గాని, ఇతర పార్టీ ముఖ్య నేతలు  తమ వారి గెలుపు కోసం తాపత్రయ పడ్డారే తప్ప తక్కిన పేద సామాజికవర్గాల అభ్యర్థులను పట్టించుకోలేదంటూ చర్చించుకుంటున్నారు. ఎవరికి ఏయే విధంగా లాభనష్టాలు జరిగాయో అంచనాలు వేసుకుంటూ ఇప్పుడు తామేం చేయాలో చెప్పాలంటూ తమ సామాజిక వర్గాల నేతల సలహాల కోసం సంప్రదిస్తున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. బీసీ వర్గానికి చెందిన డాంగే కుమార్‌ భార్య గతంలో కౌన్సిల్‌ సభ్యురాలు. అదేవిధంగా మైనార్టీ వర్గానికి చెందిన నజీర్‌ హుస్సేన్‌ కూడా గత కౌన్సిల్‌లో ఉన్నారు.

వారివురినీ పక్కన పెట్టి గద్దె తన సామాజిక వర్గం వారికే టిక్కెట్లు ఇచ్చుకుని గెలిపించుకున్నారని నగరంలోని బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన నేతలు తలపోసుకుంటున్నారు. పాత డివిజన్ల లోని కొన్ని ప్రాంతాలు అటు ఇటు మారినా తమ వారిని మాత్రం ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకుని జాగ్రత్త పడ్డారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే గట్టు కింద ప్రాంతానికి చెందిన పోటీదారు, అనుచరులు తమను చిన్నచూపు చూస్తున్నారని బాహాటంగానే వ్యాఖ్యానించినట్లు టీడీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. ఎన్నికలకు రెండు రోజులు ముందు వరకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు లేదంటే ఎలాగని కొందరు నిలదీయ గా, పోగైన సొత్తును ఏం చేశారని సీనియర్లు  ఆరా తీశారని సమాచారం.  

బొండాతో తొలి నుంచీ అంతే...  
కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాల్లో మధ్య నియోజకవర్గ ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావు సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య కాస్త ఎక్కువ. బొండా, గద్దెల మధ్య ఎప్పుడూ పొసగదనేది పార్టీలో బహిరంగ రహస్యమే. అంతెందు కు తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా గెలుపొందిన ఏడుగురు ఎవరెవరో పరిశీలిస్తే   నాయకు ల మనస్తత్వం తేటతెల్లం అవుతుందంటున్నారు.  
4వ డివిజన్‌: ఈ డివిజన్‌ గతంలో రెండు, మూడు డివిజన్లలో ఉండేది. గత కౌన్సిల్‌లో ఈ ప్రాంతం నుంచి దేవినేని అపర్ణ కార్పొరేటర్‌గా కొనసాగారు. ప్రస్తుతం జాస్తి సాంబశివరావు గెలుపొందారు.  
8వ డివిజన్‌: గతంలో ఇందులో 13వ డివిజన్‌లో కొంత మేర ఉండేది. ఈ డివిజన్లో 2014–19 వరకు జాస్తి సాంబశివరావు కార్పొరేటర్‌గా కొనసాగగా ప్రస్తుతం చెన్నుపాటి ఉషారాణి గెలిచారు.  
9వ డివిజన్‌ : ఈ ప్రాంతం పూర్వం 13వ డివిజన్‌గా ఉండేది. ఇందులో గత కౌన్సిల్‌లో కార్పొ రేటర్‌గా చెన్నుపాటి గాంధీ వ్యవహరించగా తాజా ఎన్నికల్లో  చెన్నుపాటి క్రాంతిశ్రీ గెలుపొందారు.  
10వ డివిజన్‌: ఇది గతంలో 8, 9 డివిజన్‌లలో కొంత భాగంగా ఉండేది. ఈ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా దేవినేని ఆపర్ణ కార్పొరేటర్‌గా గెలిచారు.  
11వ డివిజన్‌: ఈ డివిజన్‌ గతంలో 9వ డివిజన్‌గా ఉండేది. కోనేరు శ్రీధర్‌ మేయర్‌గా ఈ డివిజన్‌ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కేశినేని శ్వేత కార్పొరేటర్‌గా గెలుపొందారు.  
12వ డివిజన్‌ : ఈ డివిజన్‌ గతంలో 10వ డివిజన్‌గా ఉండేది. 2014–19 వరకు ఈ డివిజన్‌ మైనార్టీ వర్గానికి చెందిన నజీర్‌ హుస్సేన్‌ కార్పొరేటర్‌గా కొనసాగారు. సిట్టింగ్‌ అయిన నజీర్‌కు టిక్కెట్‌ ఇవ్వలేదు. ఇక్కడి నుంచి సాయిబాబుగెలుపొందారు.   
13వ డివిజన్‌ : ఈ డివిజన్‌ గతంలో 11వ డివిజన్‌గా ఉండేది. 2014–17 వరకు బీసీ నాయకుడు వీరంకి డాంగే కుమార్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2016లో ఆకస్మిక మరణంతో ఆయన సతీమణి వీరంకి కృష్ణకుమారి ఉప ఎన్నికల్లో  పోటీచేసి కార్పొరేటర్‌గా గెలిచారు. డాంగే కుటుంబాన్ని పక్కనపెట్టి ముమ్మినేనిని గెలిపించుకున్నారు.  
15వ డివిజన్‌: ఈ డివిజన్‌ గతంలో 14వ డివిజన్‌గా ఉండేది. 2014–19 కౌన్సిల్‌లో ఉమ్మడిశెట్టి బహదూర్‌ (వైఎస్సార్‌ సీపీ ) కార్పొరేటర్‌గా ఉన్నా రు. 2021లో ఈ డివిజన్‌ 15గా మారింది.  ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి రత్నం రమేష్‌ సతీమణి రత్నం రజని పోటీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో రత్నం రజనీని విత్‌డ్రా చేయించారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన బెల్లం దుర్గ డిప్యూటీ  మేయర్‌ అయ్యారు.
చదవండి:
చంద్రబాబు – నారాయణపై విచారణకు బ్రేక్‌ 4 వారాలు ‘స్టే’ 
తిరుపతి ఫలితం అదిరిపోవాలి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి 

Read also in:
Back to Top