Narayana Arrest Case: నారాయణ ‘లీక్స్‌’: చంద్రబాబుకు మైనస్.. ఎలాగంటే?

Kommineni Srinivasa Rao Article On Narayana Arrest In Question Paper Leakage Case - Sakshi

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ పదో తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో అరెస్టు అవడం, తెల్లవారేసరికల్లా ఆయన బెయిల్‌పై విడుదల కావడం జరిగిపోయాయి. నారాయణ బెయిల్‌పై విడుదల కాగానే తెలుగుదేశంకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఇదంతా  ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనతేనని ప్రచారం చేయడం విశేషం. నారాయణ విడుదల అయ్యేంతవరకు చంద్రబాబు క్షణం, క్షణం పరిస్థితిని మోనిటర్ చేశారని, లాయర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారని కూడా ఆ మీడియా తెలిపింది. ఇది ఆసక్తికరమైన విషయమే. చంద్రబాబుకు ఈ విషయంలో ఉన్న సమర్దత గురించి మరోసారి చెప్పకనే చెప్పేశారు.
చదవండి: కార్పొరేట్‌ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. 

దేశంలో అనేక చోట్ల ఎందరో ప్రముఖులు ఆయా కేసులలో అరెస్టు అయ్యాక, బెయిల్‌పై విడుదల కావడానికి, రోజులు, వారాలు పడుతుంటే, నారాయణ కనీసం జైలు వరకు వెళ్లకుండానే రావడం గొప్పతనమే అవుతుంది. ఇందుకు నారాయణను అభినందించాలో, చంద్రబాబును పొగడాలో తెలియదు. ఈ విషయంలో కొందరు కొన్ని చమత్కార వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు వద్ద అంత గట్టి లీగల్ టీమ్ ఉందన్న సంగతి తెలిస్తే విజయ్ మాల్యా, చోక్సి, నీరవ్ మోడీ వంటివారు దేశం వదలిపారిపోకుండా ఆయన సలహాలు పొందేవారేమోనని వారు అంటున్నారు. కాని, లక్షలాది మంది విద్యార్ధుల భవితవ్యానికి సంబంధించిన కేసులో ఇలా బెయిల్ రావడం మాత్రం అంత స్వాగతించవలసిన అంశం కాదు.

టీడీపీ లాయర్ల సమర్ధతో, ఇంత పెద్ద పోలీసు యంత్రాంగం, ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉన్నప్పటికి ప్రభుత్వం ఇలాంటి కేసులలో నిందితులుగా పేర్కొన్నవారిని జైలుకు కూడా పంపలేని పరిస్థితి ఏర్పడడం ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందే అని చెప్పాలి. కాని రాజకీయంగా చూస్తే ఇది జగన్‌కు ప్లస్ అవుతుంది. చంద్రబాబుకు మైనస్ అవుతుంది. ఎలాగంటే విద్యారంగంలో పాతుకుపోయిన తిమింగలాలను పట్టుకోవడం ఎవరి వల్ల కాదని, ఆ మాఫీయా దెబ్బకు ఎవరైనా లొంగిపోవల్సిందేనని ప్రజలు భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నారాయణను టచ్ చేయడమే కాకుండా, కేసు నమోదు చేయగలిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీలో నారాయణ ప్రమేయం ఉందని ఆధార సహితంగా పోలీసులు చెప్పగలిగారు.
చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’

నారాయణ కాలేజీల సిబ్బందే ఈ లీకేజీల వ్యవహారంలో కీలక భూమిక పోషించడం, అలా పట్టుబడ్డవారు ఇందులో నారాయణ పాత్ర గురించి వెల్లడించడం జరిగింది. అయితే నారాయణ ఆ విద్యా సంస్థలకు ఇప్పుడు చైర్మన్‌గా లేరంటూ రాజీనామా లేఖను కోర్టులో పెట్టి బెయిల్ పొందగలిగారు. నిజంగానే అది నిజమైన రాజీనామానా?లేక ఉత్తుత్తి రాజీనామానా అన్నది ప్రజలందరికి తెలుసు. ఆయనకు సంస్థతో సంబంధం లేకపోతే పరీక్షలకు ముందు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టి తన సిబ్బందికి ప్రశ్నాపత్రాల లీకేజీ ఎలా చేయాలన్న దానిపై, ప్రభుత్వ టీచర్లను ఎలా ప్రలోభ పెట్టాలన్నదానిపై ఎందుకు క్లాస్ తీసుకున్నారో వివరించవలసి ఉంటుంది.

సాంకేతిక కారణాలతో కోర్టు బెయిల్ ఇచ్చినా, ప్రజల దృష్టిలో ఈయన తప్పు చేసినట్లే లెక్క. కాకపోతే వేల కోట్ల అధిపతి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన నారాయణ ఎలాగైనా తన లాయర్ల ద్వారా బెయిల్ పొందగలిగారు. వ్యక్తుల హక్కులను,స్వేచ్ఛను కాపాడడంలో న్యాయ వ్యవస్థ ముందు ఉండవలసిందే. ఎవరికైనా ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే కోర్టులు నిరోధించవలసిందే. కాని ఇలాంటి వ్యవస్థీకృత కేసులలో నిందితుడు కనీసం జైలుకు కూడా వెళ్లకపోతే సమాజం ఎలా చూస్తుందన్నది అన్ని వ్యవస్థల వారు ఆలోచించాలి. కొన్ని కేసులలో ఇదే రకమైన వాదన ఎందుకు నిలబడలేదో తెలియదు. ఉదాహరణకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడలో ఒక కేసులో సంబంధిత సంస్థకు తాను యజమానిని కానని నిందితుడు చెప్పినా, పోలీసులు అంగీకరించకుండా అరెస్టు చేశారు.

న్యాయ వ్యవస్థ కూడా దానిని ఓకే చేసింది. . కాని అదే న్యాయ వ్యవస్థ ప్రశ్నాపత్రాల కేసులో నారాయణ చైర్మన్ పదవిలో లేడన్న వాదనను పరిగణనలోకి తీసుకుంది. మరి వీటిలో ఏది రైట్ అంటే ఏమి చెబుతాం. ఏపీలో గత నెలాఖరులో ప్రశ్నాపత్రాల లీకేజీ పెద్ద సంచలనంగా మారింది. వాట్సప్‌ల ద్వారా లీక్ చేసే కొత్త సంస్కృతికి కార్పొరేట్‌ కాలేజీలు తెరదీశాయి. మామూలు రోజులలో పోటీ ఉన్నట్లు వ్యవహరించే ఈ సంస్థలు ప్రశ్నాపత్రాల లీక్‌లో మాత్రం కలిసికట్టుగా ఉండడం గమనించవలసిన పరిణామం. ఈ విషయం చిత్తూరు పోలీసుల విచారణలో వెల్లడైంది.

పోలీసులు అత్యంత పకడ్బందీగా కేసును డీల్ చేస్తే చంద్రబాబుకు మాత్రం ఇది కక్షగా కనిపించింది. తొలుత ఈ మాల్ ప్రాక్టీస్ మీద గగ్గోలు పెట్టిన చంద్రబాబునాయుడు ఇందులో తమకు సంబంధించిన నారాయణ స్కూల్స్ పాత్ర ఉందని తెలియగానే మాట మార్చేశారు. దీనిని మాస్ కాపీయింగ్ గాను, పరీక్షలను ప్రభుత్వం సరిగా నిర్వహించని విషయంగానూ మార్చేశారు. లక్షలాది మంది విద్యార్దులకు ఎంతో మానసిక ఆవేదన కలిగించే ఇలాంటి ఘటనలలో పద్నాలుగేళ్ల పాటు సీఎంగా, పదిహనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి అనుసరించవలసిన పద్దతి ఇదేనా? ఎవరిది తప్పు ఉన్నా సహించవద్దని చెప్పవలసిన పెద్ద మనిషి, ఈ రకంగా కార్పొరేట్ కాలేజీల కొమ్ముకాయడం, దానికి ఒక వర్గం మీడియా అండగా నిలవడం దారుణమైన సంగతే. ఆయనకు ఇదేమీ కొత్తకాదు. తన హయాంలో 2017లో కూడా నెల్లూరులో నారాయణ సంస్థ నుంచి పేపర్ లీక్ అయింది.

అప్పుడు ఈనాడు పత్రికలోనే దీనికి సంబంధించిన వార్త వచ్చింది. కాని ఆనాడు కనీసం కేసు కూడా పెట్టలేదు. దానికి కారణం నారాయణ తన క్యాబినెట్‌లో మంత్రి, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి కావడమే వేరే చెప్పనక్కర్లేదు. నారాయణతో చంద్రబాబుకు అంత లోతైన సంబంధాలు ఉన్నాయని అంటారు. 2014 ఎన్నికల సమయంలో నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు మూడు ప్రాంతాలలో టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆర్ధిక విషయాలు మొత్తం వారి అజమాయిషీలోనే ఉండేవని చెబుతారు. విశాఖతో సహా ఉత్తరాంధ్ర బాధ్యతలు నారాయణ చూశారని చెబుతారు.

ఆ సందర్భంలో వందలకోట్ల వ్యయం జరిగిందని ప్రచారం అయింది. అంతేకాక తన విద్యా సంస్థల నుంచి విద్యార్ధులను తీసుకు వచ్చి తెలుగుదేశంకు అనుకూలంగా, వైసిపికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయించారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. ఆ ఎన్నికలలో గెలవగానే చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి అయిపోయారు. ఆయన అప్పటికీ ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్సీ కాదు. మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ అయ్యారు. తదుపరి రాజధాని భూముల విషయంలో ఎలాంటి డీల్స్ జరిగాయో అప్పట్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి.

అలాంటి సంబంధాలు ఉన్న నారాయణ ఈ లీకేజీ కేసులో జైలుకు వెళ్లకుండా చూడడానికి చంద్రబాబు బాధ్యత తీసుకోవడం ఆశ్చర్యం ఏమి ఉంటుంది? అసలు ఈ కేసు బయటకు రావడంలోనే మతలబు ఉన్నట్లు కనిపిస్తుంది.మామూలుగా అయితే ఈ కార్పొరేట్ కాలేజీల వారు తమ వాట్సప్ గ్రూపులలో ఈ ప్రశ్నాపత్రాలను షేర్ చేసుకుని కామ్‌గా ఉండిపోయేవారు. కాని ఒక వైపు తమ సంస్థలకు అక్రమ ప్రయోజనం పొందుతూనే, మరో వైపు ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న వారి దుష్ట తలంపుతో మొత్తం కేసు బయటకు వచ్చింది. నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఈ ప్రశ్నాపత్రాన్ని చిత్తూరులోని విలేకరుల బృందానికి కూడా లీక్ చేయడంతో మొత్తం తేనెతుట్టి కదిపినట్లయింది. ఆ విషయం అర్థం కాక, తెలుగుదేశం మీడియా తొలుత ప్రభుత్వంపై బురద వేయడానికి విశ్వయత్నం చేసింది.

తీరా అదంతా తమ వాళ్ల మహిమే అని తెలియగానే, టీడీపీతో పాటు ఈ వర్గం మీడియా కూడా మొత్తం స్వరం మార్చేసింది. ఇంత గొప్ప నారాయణను అరెస్టు చేయడమా అన్నట్లు వార్తలు ఇచ్చాయి. అదే సమయంలో నారాయణ కాలేజీలో లీకేజీ అక్రమాలు జరగలేదని మాత్రం వీరెవరూ ఖండించలేకపోతున్నారు. నారాయణ పాత్ర గురించే సిబ్బందే వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు ఆయన వరకు వెళ్లింది. కాని దానిని టీడీపీ మీడియా, చంద్రబాబు సహించలేకపోయారు. వెంటనే ఖండోపఖండనలు ఇచ్చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే నారాయణను పోలీస్ స్టేషన్ గోడలు బద్దలు కొట్టి బయటకు తీసుకువస్తామని హెచ్చరించారు.

ఇది రాజద్రోహమో, ప్రజాద్రోహమో అవుతుందో లేదో తెలియదు. మహారాష్ట్రలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే ఇంటి వద్ద హనుమాన్ చాలీసా చదువుతానని ప్రకటించినందుకే కేసుకు గురై వారం రోజులపాటు జైలులో ఉండవలసి వచ్చింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన గుజరాత్ ఎమ్మెల్యేని అసోంలో అరెస్టు చేసి రోజుల తరబడి జైలులో ఉంచారు. ఇలా కొన్ని రాష్ట్రాలలో ఉంటే, మరికొన్ని రాష్ట్రాలలో న్యాయవ్యవస్థలోని వారిని కించపరిచారని నెలల తరబడి జైలులో ఉంచారు. అదే ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో వ్యక్తికి అడ్వాన్స్ బెయిల్ వచ్చింది. న్యాయ వ్యవస్థలో ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉంటే సమాజానికి మంచిదని చెప్పాలి. ఏది ఏమైనా లక్షల మంది విద్యార్ధులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిన లీకేజీ ఘటనల వంటివాటిలో ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు మరింత బాధ్యతగా ప్రవర్తించి ఉంటే బాగుండేదేమో!

కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top