కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు  | Kishan Reddy Sensational Comments on Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు

Feb 27 2024 2:39 AM | Updated on Feb 27 2024 2:39 AM

Kishan Reddy Sensational Comments on Congress - Sakshi

సనత్‌నగర్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తంమీద కాంగ్రెస్‌ పార్టీకి 40 సీట్లు కూడా రావని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ను ఎక్కడా ప్రజలు నమ్మడం లేదనీ, రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ఆ పార్టీ నేతలే నమ్మడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లిపోతారన్నారు. కిషన్‌రెడ్డి చేపట్టిన విజయసంకల్ప యాత్ర సోమవారం సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కొనసాగింది. పద్మారావునగర్‌ స్వరాజ్య ప్రెస్‌ సర్కిల్‌లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం యాత్ర ప్రారంభించారు.

అక్కడి నుంచి మొదలైన యాత్ర ముషీరాబాద్‌ చౌరస్తా, బైబిల్‌ హౌస్, హిల్‌ స్ట్రీట్, షోలాపూర్‌ స్వీట్‌హౌస్, మహంకాళి స్ట్రీట్, బేగంపేట రైల్వేస్టేషన్, అమీర్‌పేట గురుద్వారా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా అమీర్‌పేటలో జరిగిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్నా నష్టమేమీ ఉండదన్నారు. 

మళ్లీ మోదీనే పీఎం కావడం ఖాయం 
రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రధాని కావడం ఖాయమనీ, మూడోసారి ఆయన ప్రధాని కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందనీ, దేశ ప్రతిష్టను ఆయన పెంచారని అన్నారు. గత పదేళ్ల కాలంలో దేశం ప్రశాంతంగా ఉందంటే అది మోదీ వల్లేనని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా ఐఎస్‌ఎస్‌ కార్యకలాపాలు లేవని, జమ్మూ కశ్మీర్‌లో నేడు శాంతియుత వాతావరణం ఉందన్నారు. మోదీ నాయకత్వం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, అలాంటి మోదీకి రాష్ట్రం నుంచి ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి బహుమతిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ యాత్రలో కిషన్‌రెడ్డి వెంట ఎంపీ లక్ష్మణ్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్, కార్పొరేటర్లు సరళ, సుచిత్ర, దీపిక, నాయకులు వెల్లాల రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement