‘బీజేపీలో ఉంటూనే ‘ఆప్‌’ కోసం పని చేయండి’.. కార్యకర్తలకు కేజ్రీవాల్‌ పిలుపు!

Kejriwal Appealed To All BJP Workers Stay With BJP Work For AAP - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు కీలక సూచన చేశారు ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. అధికార బీజేపీ పార్టీలోనే ఉంటూ ఆప్‌ కోసం పనిచేయాలని కోరారు. ‘బీజేపీ నుంచి నిధులు అందుకోండి. కానీ అక్కడి నుంచి ఆప్‌ కోసం పని చేయండి’ అని పేర్కొన్నారు. గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌కోట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేజ్రీవాల్‌. 

‘మాకు బీజేపీ నాయకులు అవసరం లేదు. వారి నేతలను బీజేపీనే అట్టిపెట్టుకోని. బీజేపీకి చెందిన పన్నా ప్రముఖ్స్‌, గ్రామాలు, బూత్‌, తాలుక స్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున మా పార్టీలో చేరుతున్నారు. చాలా ఏళ్లుగా బీజేపీకి సేవలందిస్తున్న పార్టీ కార్యకర్తలకు కాషాయ పార్టీ ఏమించ్చిందని వారిని ఆడగాలనుకుంటున్నా? మీరు (బీజేపీ కార్యకర్తలు)  ఆ పార్టీలోనే ఉండండి. అయితే, ఆమ్‌ ఆద్మీ పార్టీ కోసం పని చేయండి. చాలా మంది బీజేపీ నుంచి డబ్బులు అందుకుంటున్నారు. ఆ నగదు తీసుకుంటూనే మా కోసం పని చేయండి. ఎందుకంటే మా వద్ద డబ్బులు లేవు.’ అని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. 

గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఉచిత విద్యుత్తు అందిస్తామని, అది బీజేపీ కార్యకర్తల ఇళ్లకు సైతం వర్తిస‍్తుందన్నారు కేజ్రీవాల్‌. ‘మీకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మీ పిల్లలకు  మంచి స్కూల్స్‌లో ఉచిత విద్య అందిస్తాం. మీ కుటుంబ సభ్యులకు ఉచితంగా నాణ్యమైన వైద్యంతో పాటు మీ కుటుంబంలోని మహిళలకు రూ.1,000 సాయం చేస్తాం.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్‌. 

ఇదీ చదవండి: ఆప్‌కు ఫేవర్‌గా గుజరాతీలు!.. సర్వేలపై కేజ్రీవాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top