కర్ణాటక సీఎం మార్పు? కుండ బద్దలుకొట్టినట్లు వేణుగోపాల్‌ ప్రకటన | kc venugopal on Siddaramaiah is still CM of Karnataka kc | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎం మార్పు? కుండ బద్దలుకొట్టినట్లు వేణుగోపాల్‌ ప్రకటన

May 26 2026 6:06 PM | Updated on May 26 2026 10:47 PM

kc venugopal on Siddaramaiah is still CM of Karnataka kc

న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహగానాలు వస్తున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ వేర్వేరుగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాటిచ్చిన మేరకు తనకు సీఎం పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఐదేళ్లపాటు తననే సీఎంగా కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నారు. సీఎం సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి, డీకే శివకుమార్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలన‍్నదే అధిష్ఠానం ఆలోచనగా తెలుస్తోంది.

సిద్ధరామయ్యకు క్షేత్రస్థాయిలో ప్రజాబలం, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నాయి. డీకే శివకుమార్‌కు మంచి వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్‌గా అనుభవం ఉంది. సిద్ధరామయ్యను మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్ఠానం ఉంది. సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, తదితర అంశాలను సిద్ధరామయ్య వివరించారు. ఏ మార్పు అయినా  రాజ్యసభ ఎన్నికల తర్వాత ఉండొచ్చు.

దీనికి మించి ఏమీ లేదు: వేణుగోపాల్‌ స్పష్టం 
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం మార్పు వార్తలన్నీ ఊహగానాలేనని తెలిపారు. రాజ్యసభ , కౌన్సిల్ ఎన్నికలపైనే చర్చించామని, ఇవి కాక మరే విషయాలపైనా చర్చించలేదని చెప్పుకొచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా ఉన్నారు.

‘‘మీవన్నీ కేవలం ఊహాగానాలే, అందులో నిజం ఏమీ లేదు. ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సమావేశం నిర్వహించాం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, కర్ణాటక ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి, నేను ఈ చర్చలో పాల్గొన్నాం. మొత్తం చర్చ రానున్న రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలపైనే సాగింది. కర్ణాటక రాజ్యసభ, కౌన్సిల్ స్థానాల అభ్యర్థుల పేర్లను ఇతర రాష్ట్రాల స్థానాల అభ్యర్థులతో పాటు ప్రకటిస్తాం. ఈ రోజు మేం తీసుకున్న నిర్ణయం ఇదే, దీనికి మించి ఏమీ లేదు" అని వేణుగోపాల్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement