Yogi Adityanath Oath: యోగి ప్రమాణ స్వీకారానికి పీఎం మోదీ చీఫ్‌ గెస్ట్‌.. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ టీంకూ ఆహ్వానం!

The Kashmir Files Team Invited To Yogi Adityanath Oath Ceremony - Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడమే కాదు.. ఉత్తర ప్రదేశ్‌కు రెండో దఫా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు యోగి ఆదిత్యానాథ్‌. మార్చి 25 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. 

ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ చీఫ్‌ గెస్ట్‌గా హాజరు కాబోతున్నారు. మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, మరికొందరు బీజేపీ కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  స్టేజ్‌పై ప్రధాని మోదీ, నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగి ఫొటోలతో భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేయనున్నారు. 

రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు సైతం యోగి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, కంగనా రనౌత్‌, బోనీ కపూర్‌లకు ఆహ్వానం అందాయి. అంతేకాదు.. తాజాగా భారీ హిట్‌ సాధించిన ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపింది యూపీ బీజేపీ యూనిట్‌. నటుడు అనుపమ్‌ ఖేర్‌తోపాటు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రికి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్‌లోకి అడుగుపెట్టింది కూడా. 

స్టేడియంలో అదనంగా 20వేల కుర్చీలను వేయించారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో బీజేపీ అభిమానగణం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో దాదాపు 37 ఏళ్ల తర్వాత.. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకుని తిరిగి సీఎం పదవిని చేపడుతున్న ఘనత యోగి ఆదిత్యానాథ్‌కు దక్కింది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో 255 సీట్లు గెల్చుకుని, 41.29 శాతం ఓటింగ్‌ షేర్‌ దక్కించుకుంది బీజేపీ.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top